జగన్ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఆ జిల్లా వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాను లోక్ సభ స్థానం ఆధారంగా విభజిస్తే అభివృద్ది చెందిన ప్రాంతాలు విజయనగరంలోకి వెళ్లిపోతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. భవిష్యత్ లో రాజకీయంగాను ఇబ్బందులు ఎదురవుతాయని, శ్రీకాకుళం జిల్లా ప్రజలు విభజనకు ఎంత మాత్రం అంగీకరించరని తన బాణీని వినిపించారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ సీఎస్ నేతృత్వంలో కమిటీ వేయడం తో జిల్లాల ఏర్పాటుపై అభ్యర్ధనలు, వినతులు కమిటీ ముందుకు వెళ్తున్నాయి.
అయితే ఇదే స్పీడ్ లో తమ జిల్లాని విభజించొద్దని శ్రీకాకుళం వాసుల నుంచి డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ వేడి చల్లారాలంటే? దర్మాన ప్రసాదరావుని కూల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై పడింది. ప్రభుత్వంలో ఆయనకు పెద్ద పీట వేసే అవకాశం ఉందని ఊహాగానాలొచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ఏర్పాటులో కీలక బాధ్యతలు ఆయనే అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ ఈ వ్యవహారం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఏర్పాటు షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు సోదరుడు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ని జగన్ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రహదారాలు, భవనాలశాఖ మంత్రిగా కృష్ణదాస్ ఉన్నారు. దీనిలో భాగంగా కృష్ణదాస్ కి ఆ శాఖ నుంచి ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ధర్మానకు అవే శాఖలు అప్పగిస్తూ, ధర్మానకు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతలు కల్పించాలని నిర్ణయించారు. ఇరువురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం జగన్ కి లైన్ ఈజీ అయింది. ఈ నిర్ణయంతో ధర్మాన ప్రసాదరావు స్పీడ్ తగ్గించే అవకాశం అయితే కనిపిస్తోందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మరి ధర్మాన మనసులో ఏముందో? పదవితో పనిలేకుండా శ్రీకాకుళం వాసుల అభివృద్దిని చిత్తశుద్దితో కోరుకుంటారా? తమ్ముడికి పదవి దక్కిందని కూల్ గా ఉంటారా? అన్నది చూడాలి.