దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న వేళ వరుసగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ఎత్తేయటంతో ప్రజలందరూ ఊపిరిపీల్చుకుంటూ సాధారణ జీవితంలోకి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వెను వెంటనే మరో కొత్త వేరియంట్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉందని నివేదికల ఆధారంగా తెలుస్తుంది. డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది… కొత్తగా ‘డెల్టా ప్లస్’గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
కరోనా రెండో దశ విజృంభణకు డెల్టా వేరియంటే ఎలా అయితే కారణమయిందో… మూడో వేవ్ కు ఈ డెల్టా ప్లస్ దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడటంతో మూడో వేవ్ తప్పేలా లేదనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇదే ప్రమాదకారైనా వేరియంట్ అని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇటీవల ప్రకటించింది.
దేశంలో కరోనా వేరియంట్లను పరిశీలించడం కోసం ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ (ఐఎన్ఎస్ఏసీవోజీ) డెల్టా ప్లస్ వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఊపిరితిత్తుల్లోని కణాలకు చాలా బలంగా పెనవేసుకుంటోందని, అలాగే శరీరంలోని యాంటీబాడీల పనితనాన్ని ఈ వేరియంట్ బాగా తగ్గిస్తోందని పరిశోధకులు తెలిపారు.
డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైరస్ సోకే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవల తెలిపారు. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకుతుందని హెచ్చరించారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.