కరోనా వైరస్ (కోవిడ్ 19) కొత్త వేరియంట్ డెల్టా ప్లస్.. సరికొత్త భయాల్ని తీసుకొస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. నిజానికి, ఈ వేరియంట్.. కొన్నాళ్ళ క్రితమే దేశంలో విస్తరించింది. అయితే, ఆ ‘వేరియంట్’ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు జరిగి వుంటే, కేసుల సంఖ్య మరింత ఎక్కువగా వుండి వుండేదేమో.
ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వల్లనే మూడో వేవ్ వస్తుందా.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలు వున్నాయి. అయితే, దేశంలో లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే వెసులుబాట్లు లభిస్తుండడం.. పర్యాటక ప్రాంతాలు, అన్ని ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతుండడం.. విద్యాసంస్థలు, సినిమా హాళ్ళు సైతం తెరుచుకుంటుండడంతో మూడో వేవ్.. అంచనాల కంటే అత్యంత వేగంగా దేశాన్ని కమ్మేసే అవకాశం వుందన్న భయాందోళలు పెరుగుతున్నాయి. షరామామూలుగానే ప్రభుత్వాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. ‘సర్వసన్నద్ధంగా వుంటాం..’ అని ప్రభుత్వాలు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మడానికి వీల్లేని పరిస్థితి.
ప్రభుత్వాలే సరిగ్గా వుంటే, రెండో వేవ్ దేశంలో ఎందుకు వస్తుంది.? వేలాది మందిని ఎందుకు బలికొంటుంది.? మూడో వేవ్ వస్తే.. ఒక్క మహారాష్ట్రలోనే 50 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయన్నది ఓ అంచనా. ఇదొక్కటి చాలు.. మూడో వేవ్ ప్రభావం ఎంత దారుణంగా వుంటుందో చెప్పడానికి. ప్రజలే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బతికుంటే బలుసాకు అయినా తిని బతకొచ్చు.