ఉచిత వ్యాక్సినేషన్.. నరేంద్ర మోడీ పుణ్యమేనా.?

‘దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..’ అంటూ భారతీయ జనతా పార్టీ, దేశవ్యాప్తంగా ‘ఉచిత ప్రచారం’ చాలా గట్టిగా చేసేస్తోంది. నిజమేనా.? దేశ ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సినేషన్ అందుతోందా.? ఈ ఉచిత వ్యాక్సినేషన్ వెనుక కథేంటి.? వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తోంది. అవే వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుంచి ప్రైవేటు ఆసుపత్రులూ వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నాయి. కేంద్రం, దేశవ్యాప్తంగా ఉచితంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ కోసం వ్యాక్సిన్లు అందిస్తున్న మాట వాస్తవం. ఇందులో తప్పుపట్టడానికేమీ లేదు. ఇక, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి వ్యాక్సిన్లు కొనుక్కోగలిగినవారు, కొనుక్కుంటున్నారు. సో, దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ ఉచితంగా అందుతోన్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే, 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నాయి.

ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తున్నారన్నమాటల్లో అస్సలు వాస్తవం లేదు. అవి ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి అధినేత ప్రధాని కావొచ్చుగాక. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తోంది. మరి, అలా కొనుగోలు చేయడానికి కేంద్రానికి నిధులు ఎలా వస్తాయి.? కేంద్ర ప్రభుత్వ ఖజానా అంటే.. అది మళ్ళీ ప్రజల పన్నులకు సంబంధించిన వ్యవహారమే. కేంద్ర ప్రభుత్వ పథకాలైనా, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలైనా.. ఉచితంగా ప్రధాన మంత్రీ ఇచ్చేయరు.. ఉచితంగా ముఖ్యమంత్రీ ఇచ్చేయరు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తాయి. మళ్ళీ ఇక్కడ ఉచితంగా.. అంటే, కండిషన్స్ అప్లయ్.. అదేనండీ షరతులు వర్తిస్తాయన్నమాట. ప్రభుత్వాల ఖజానాలు నింపడానికి మళ్ళీ బాదుడు బాదేది జనాన్నే. పబ్లిసిటీ మాత్రం రాజకీయ నాయకులకి. అదే రాజకీయమంటే.