లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కళ్లారా చూస్తున్నాం. తిండి లేక..నిద్రాహారాలు మానుకుని జాతీయ రహదారుల వెంబడి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ విషయాలన్నింటిపై అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస కూలీలకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వాళ్ల పట్ల ఉదారంగా ఉండాలని పోలీసులకు సూచించారు. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను మానవీయ కోణంలో ఆదరించాలని అన్నారు. వలస కూలీల కోసం తక్షణం బస్సులు సిద్దం చేయలన్నారు. దీనికి సంబంధించి విధి, విధానాలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించారు. వలస కూలీలు ఎవరీని టిక్కెట్ అడగ వద్దని..ఆ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
రాష్ర్ట సరిహద్దుల వరకూ వాళ్లను ఉచితంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. వారికి అవసరమైన భోజనాలు, నీళ్లు, వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు నిర్ధేశించారు. ప్రోటో కాల్ పాటిస్తూ 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం నిర్ణయించారు. వలస కూలీలపై ఇప్పటివరకూ ఏ రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలిసారి జగన్ ప్రాంతం, రాష్ర్టం వంటివి చూడకుండా రాష్ర్ట సరిహద్దు వరకూ తరలించాలన్న ఆదేశాలతో ప్రజలు హర్ష వ్యక్తం చేసారు.