ముగిసిన గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు .. నేతలకి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం !

గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌, మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రేపు పరిశీలించనున్నరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహణ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

ముగిసిన గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు

ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దు. పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోదాం. విద్యావంతులు, మేధావులకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి చెప్పండి. ప్రతీ కార్యకర్త.. తామే బరిలో ఉన్నామనుకొని శ్రమించాలి. పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. గెలుపు ఖాయమయ్యేలా వ్యూహాలను అమలు చేసి వాణీదేవిని గెలిపించుకురండని హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎంకేసీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యం గా టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. బలమైన రాజకీయ నేపథ్యం, ఉన్నత విద్యావంతురాలు కావడం తో పట్టభద్రుల స్థానంలో ఆమెకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ పరంగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆమె అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. వాణీదేవి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.