దావోస్ రాజకీయం: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.!

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా, పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో కల్గించే సౌకర్యాల్ని వైఎస్ జగన్ బృందం వివరించనుంది. దావోస్‌లో గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందం పర్యటించింది.. అంటే, అది చంద్రబాబు హయాంలో జిరిగిన వ్యవహారం.

అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా ‘దావోస్’ గురించి ఇచ్చిన పబ్లిసిటీ అంతా ింతా కాదు. చిత్రమేంటంటే, ఇప్పుడు వైఎస్ జగన్ దావోస్ పర్యటన గురించి టీడీపీ పెద్దగా ‘కవర్’ చేయడం లేదు. అఫ్‌కోర్స్ అప్పట్లో వైసీపీ అనుకూల మీడియా, చంద్రబాబు దావోస్ పర్యటన మీద నానా రకాల నెగెటివిటీ ప్రచారం చేసిందనుకోండి.. అది వేరే సంగతి.

అప్పట్లో చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరి వ్యక్తులతో ముడిపడి వున్న అంశం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అనేది. టీడీపీ అనుకూల మీడియా అయినా, వైసీపీ అనుకూల మీడియా అయినా.. రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతనెరిగి వ్యవహరించాలి. దురదృష్టమేంటంటే, ఆంద్రప్రదేశ్‌లో అలాంటి ‘సానుకూలత’ను ఆశించలేం.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, టీడీపీ అనుకూల మీడియా అయినా, వైసీపీ అనుకూల మీడియా అయినా.. ప్రధాన కార్యకలాపాలు హైద్రాబాద్ నుంచే జరుగుతుంటాయి. అలాంటివాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకు బాధ్యత వుంటుంది.? అదే అసలు సమస్య.

‘ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం..’ అని చంద్రబాబు తన అనుకూల మీడియాకి చెప్పరు.. వైఎస్ జగన్ కూడా అలాగే చేస్తారా.? అంటే, ‘చెయ్యరు’ అనలేని పరిస్థితి.

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయమే ప్రధాన శతృవు. సుదీర్ఘ తీర ప్రాంతం, అందుబాటులో అన్ని సహజ వనరులు.. అన్నిటికీ మించి అపారమైన మేధోసంపత్తి రాష్ట్రం సొంతం. కానీ, ఇవన్నీ, రాజకీయం ముందు వీగిపోతున్నాయ్.