‘నన్ను జైలుకు పంపుతావా.? టచ్ చేసి చూడు ఏమవుతుందో..’ అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయం రోజురోజుకీ మరింత వేడెక్కుతూ వస్తోంది. ఎన్నికలొస్తే చాలు, ‘కేసీయార్ అరెస్టవడం ఖాయం..’ అనే వాదన బీజేపీ నేతల నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ఇలా అన్ని సందర్భాల్లోనూ, కేసీయార్ అరెస్టు ప్రకటనలతో బీజేపీ హంగామా చేస్తూ వచ్చింది.
అసలు కేసీయార్‌ని అరెస్టు చేయాల్సిన అవసరమేంటి.? కేసీయార్ అరెస్టు గోల కేవలం ఎన్నికల సమయంలోనే ఎందుకు బీజేపీ నేతల నుంచి వినవస్తోంది.? ఈ చర్చ తెలంగాణ సమాజంలో గట్టిగానే జరుగుతోంది.
కేసీయార్ తప్పు చేసి వుంటే, కేంద్రం ఉపేక్షించాల్సిన పనిలేదు. కేంద్రం ఉపేక్షిస్తోందంటే, కేసీయార్ తప్పు చేయలేదనే అనుకోవాలేమో. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజాతి సహజం. ముఖ్యమంత్రి విషయంలో ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఎవరికీ తగదు.
కేసీయార్ మీద అనుమానాలుంటే, కేసీయార్ అవినీతి చేశాడన్న ఆధారాలుంటే, ఎంచక్కా బీజేపీ నేతలు కోర్టుల్ని ఆశ్రయించొచ్చు. కేంద్రంలో అధికారంలో వున్నది తామే గనుక.. కేసీయార్‌ని అరెస్టు కూడా చేసెయ్యొచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది వేరే చర్చ.
ఏదిఏమైనా, బీజేపీ మార్కు తాటాకు చప్పుళ్ళు.. హాస్యాస్పదమైపోతున్నాయి. అందుకే కేసీయార్ డేర్ చేశారు.. బీజేపీకి సవాల్ చేశారు.. టచ్ చేసి చూడమని. మరి, బీజేపీ టచ్ చేసేందుకు ప్రయత్నిస్తుందా.? వేచి చూడాలిక.