Curfew: నేటి రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ

Curfew: కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ ప్రస్తుతం భారత్ లోనూ విస్తరిస్తోంది. తెలుగు రాష్టాలను కూడా వదిలిపెట్టలేదు. మొత్తం పదమూడు రాష్టాల్లోనూ ఒమిక్రాన్ టెన్షన్ తప్పట్లేదు. దీంతో మళ్ళీ ఆయా రాష్ట్రాలు కర్ఫ్యూ బాట పడుతున్నాయి. ఇప్పటికీ ఒమిక్రాన్ కేసులు 400కు చేరువ అవుతోంది.

ఇక క్రిస్మస్, ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు.. ఇక సంక్రాంతి పెద్ద పండుగ పేరుతో పందాలు, షాపింగ్ లు ఇలా ఎక్కడ చూసిన జనం గుంపులు గుంపులుగా కనిపించే ప్రమాదం ఉంది. దీంతో గుబులు మరింత పెరుగుతుంది. అందుకే అన్ని రాష్ట్రాలు ఇప్పటికే అప్రత్తమయ్యాయి.

కరోనా కొత్త వేరియంట్ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర కూడా చేరింది. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.