కూరగాయల షాపుకి బౌన్సర్ల భద్రత… ఓఎంజీ!

గతంలో ఎప్పుడూ చూడనివి, విననివి ఈ మధ్యకాలంలో వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అన్నా అతిశయోక్తి కాదు. కాలం అలా మారిపోయింది మరి! ఈ సందర్భంగా కూరగాయల కొట్టుకుని బౌన్సర్ల భద్రత ఉంచిన ఒక విచిత్ర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.

అవును… సినిమా నటులు, సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వచ్చినపుడు, ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బౌన్సర్లు కనబడుతుంటారు. అది సహజం అనే భావన అందరికీ వచ్చేసింది. విచిత్రంగా ప్రజలతో ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో గెలిచిన “ప్రజాసేవకులు” కూడా ప్రజలు వారి దగ్గరకు రాకుండా బౌన్సర్లను పెట్టుకుంటుంటారు.

అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని వారణాశిలో ఓ కూరగాయల షాపుకి బౌన్సర్లు రక్షణగా నిలిచారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా టమాటా రేటు ఆకాశాన్నంటిన నేపథ్యంలో పలుచోట్ల కూరగాయల షాపుల్లో దొంగలు పడ్డారని తెలుస్తుంది. పైగా వారు మిగతా కూరగాయలను అక్కడే వదిలేసి టమాటా, మిర్చిని మాత్రమే ఎత్తుకెళ్లారంట.

ఇదే సమయంలో కర్నాటకలో టమాటా తోటలో దొంగలు పడి 3 లక్షల రూపాయల విలువైన పంటను ఎత్తుకెళ్లారని తెలుస్తుంది. దీంతో రిస్క్ ఎందుకుని భావించిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యాపారి… బౌన్సర్లతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. తన షాపుకి వచ్చే కస్టమర్లు టమాటాలకోసం కొట్టుకుంటున్నారని, ఈ గ్యాప్ లో కొంతమంది తెలివిగా వాటిని సంచిలో వేసుకుని వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదే సమయంలో సీసీ కెమెరాలు పెట్టినా కూడా పోయిన టమాటాలను కాపాడుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నాడంట. దీంతో దొంగతనాలకు అవకాశం లేకుండా బౌన్సర్లతో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నట్లు సదరు వ్యాపారి చెబుతున్నాడంట. అయితే.. ఇదంతా నిజంగానే రక్షణ కోసమా.. లేక, ప్రచారంలో భాగమా అంటూ సెటర్లు వేస్తున్నారు నెటిజన్లు!