తెలుగు భాషా దినోత్సవం.. అంటూ తెలుగు నాట పెద్ద హంగామా నడిచింది. నిజమే, మాతృభాషని మర్చిపోకూడదు. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. కానీ, ఏడాదిలో ఓ రోజు తెలుగు భాష గురించి గట్టిగా మాట్లాడేసుకుంటే సరిపోతుందా.? ప్రతి రోజూ, ప్రతి నిమిషం.. ప్రతి సెకెను.. మాతృభాష గురించి ఆలోచించినప్పుడే కదా మన, తెలుగు వారంతా తెలుగు భాష గురించి మాట్లాడేందుకు అర్హత పొందుతారు.. అన్నది భాషాభిమానులు ఆవేదనతో సంధించే ప్రశ్న. తెలుగు భాషా దినోత్సవం రోజున, తెలుగుకు ఇంకెలా ప్రాముఖ్యత కల్పించగలం.? అన్న దిశగా చర్చ జరగాలి. కానీ, ఇక్కడా తెలుగు మీడియం – ఇంగ్లీషు మీడియం గురించిన చర్చ తెరపైకొచ్చింది.. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి విపక్షాలకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేసేశాయ్.
తెలుగు భాష, తెలుగు మీడియం.. ఇవి రెండూ వేర్వేరు అంశాలు. పిల్లల చేత అమ్మా, నాన్నా.. అని పిలిపించుకోవడానికి ఇష్టపడని తల్లిదండ్రులున్న సమాజమిది. తమ పిల్లల్ని కాన్వెంట్ వైపు నడిపిస్తోన్న తల్లిదండ్రులు తాపత్రయ పడుతున్న పరిస్థితులివి. సో, ఇంగ్లీషు మీడియం తప్పనిసరి. ఇంట్లోనే అమ్మ.. నాన్న.. అని పిల్లలతో పిలిపించుకోవడమంటూ మొదలైతే, ఆ తర్వాత తెలుగు భాష గురించి ఇంతలా మొసలి కన్నీరు కార్చాల్సిన పనే వుండదు. తెలుగు మీడియం అవసరమే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో మొండి పట్టుదలకు పోవడం మంచిది కాదు. ఉన్నత విద్యని కూడా మాతృభాషలోనే వుండేలా చూడాలంటూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ తరుణంలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ మాతృభాష గురించి ఆలోచించాలి. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?