YS Jagan’s : క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సర్కారు తెరపైకి తెచ్చిన ‘అస్త్రం’ అనుకోవాలేమో.! సరే, అది అస్త్రమా.? లేదంటే, ఓ విభాగమా.? ఆ సీఆర్డీయే మాటున చంద్రబాబు సర్కారు చేసిన భూ పందేరం ఎలాంటిది.? అవన్నీ వేరే అంశాలు.
సీఆర్డీయే చట్టం ప్రకారమే రైతులు, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, తమ భూముల్ని రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. ఆ రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది. చంద్రబాబు హయాంలో ఐదేళ్ళు, వైఎస్ జగన్ హయాంలో దాదాపు మూడేళ్ళు.. మొత్తంగా ఎనిమిదేళ్ళపాటు, రాష్ట్ర రాజధాని అమరావతి.. ఓ వైపు పబ్లిసిటీ గిమ్మిక్కు.. ఇంకో వైపు వివాదాల కుమ్మక్కులా తయారైంది పరిస్థితి.
అమరావతిలో జరిగిన భూ కుంభకోణాల్ని వెలికి తీయడంలో వైఎస్ జగన్ సర్కారు విఫలమైంది. అమరావతి నిర్మాణం విషయంలో అయితే, అసలు బాధ్యతే చూపించలేదు. ఈ నేపథ్యంలో రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.. ఇంకో వైపు వీధి పోరాటాలూ చేస్తున్నారు రైతులు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు కూడా.
ఇన్నాళ్ళకు రైతులకు కాస్త ఊరట దొరికింది. సీఆర్డీయే చట్టం ప్రకారం, రైతులు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా అమరావతిలో అభివృద్ధి పనులు జరగాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆరు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
దాంతో, మూడు రాజధానుల దిశగా వైఎస్ జగన్ సర్కారు మరోమారు ఆలోచన చేయడానికి వీల్లేకుండా పోయింది. నిజానికి, ఇప్పటికే ఓ సారి చట్టం చేసి, దాన్ని వెనక్కి తీసుకుంది వైఎస్ జగన్ సర్కారు.. మూడు రాజధానుల విషయమై. ఇంకోసారి త్వరలో చట్టం చేయాలనుకుంటోన్న జగన్ సర్కారు ఆలోచనలపై హైకోర్టు నీళ్ళు చల్లినట్లయ్యింది.