సీపీఎస్ రగడ: వైసీపీ సర్కారుకి ఆ తలనొప్పి తగ్గేనా.?

‘ఔను మాట తప్పాం.. మడమ తిప్పుతున్నాం కూడా..’ అని నేరుగా చెప్పకుండా, ‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట వాస్తవమేగానీ, అధికారంలోకి వచ్చాకే అసలు విషయం తెలిసింది.. సీపీఎస్ రద్దు సాధ్యం కాదని..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చావు కబురు చల్లగా చెప్పారు. నిజానికి, ఇదే మాట ఇంతకు ముందు వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సెలవిచ్చారు.

‘అప్పుడేదో అవగాహన లేకుండా హామీ ఇచ్చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, అది సాధ్యం కాదని తేలింది..’ అని అప్పట్లో సజ్జల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. వైసీపీలో సజ్జల వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కూడా. ‘జగనన్న మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పే ప్రసక్తే లేదు..’ అంటూ అప్పటిదాకా చెప్పుకొచ్చిన వైసీపీ శ్రేణులు, ‘మాట తిప్పుతాం.. మడమ తిప్పుతాం..’ అన్నట్లుగా సజ్జల వ్యాఖ్యలున్నాయని మండిపడ్డాయి కూడా.

తాజాగా, సజ్జల వ్యాఖ్యల్నే బొత్స సత్యనారాయణ ఇంకాస్త అధికారిక హోదాలో సెలవిచ్చారు. ‘ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలనీ.. లేదంటే సీపీఎస్ పట్ల సానుకూలంగానే ఉద్యోగులు వున్నట్లు భావించాల్సి వుంటుందనీ’ బొత్స సత్యనారాయణ తనదైన చాణక్యాన్ని ప్రదర్శించారు.

‘అధికారంలోకి వచ్చాక అన్నీ చేసేశాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, అప్పుడు చెప్పని చాలా విషయాలు ఇప్పుడు చేసి చూపిస్తున్నాం..’ అని పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆయనే, ఎన్నికల ప్రచారం సందర్భంగా, ‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తాం..’ అని ఉద్యోగులకు హామీ ఇచ్చారాయె.

సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న దరిమిలా, కాస్త కష్టమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సీపీఎస్ రద్దు చేసేస్తే..

ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి వుంటుంది. లేదూ, మాట తప్పేశాం.. మడమ తిప్పేశాం.. మా తప్పు లేదు.. అని చెప్పదలచుకుంటే మాత్రం, వైసీపీకి ముందు ముందు ఉద్యోగుల నుంచి కష్టకాలమే. పైగా, విశ్వసనీయతను వైఎస్ జగన్ కోల్పోతారు రాజకీయంగా.