జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలనుకునేవారు ఆయన వ్యక్తిగత జీవితంలోని విషయాలను ప్రధానముగా ప్రస్తావిస్తుంటారు. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని లాగి ఆయన్ను తప్పుబడుతుంటారు. స్వయంగా జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మీడియా ముందు అసెంబ్లీలో కూడ సెటైర్లు వేశారు అంటే అర్థం చేసుకోవచ్చు.. పవన్ మీద బ్లాక్ మార్క్ వేయడానికి వారంతా ఆయన వైవాహిక జీవితాన్ని ఎలా ఎత్తిపొడుస్తూ ఉంటారో. ఇదే పవన్ అభిమానులకు అస్సలు నచ్చదు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత జీవితాల సంగతి ఎందుకు అంటారు. పవన్ సైతం తన తలరాత బాగోలేక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని, దానికి ఇంత రగడ అవసరమా అంటూ మాట్లాడారు.
ఇలా మూడు పెళ్లిళ్లు అనే మాట వినగానే అది పవన్ గురించేనని ఉలిక్కిపడుతుంటారు జనసైనికులు. అయితే తాజాగా పవన్ మూడు పెళ్లిళ్లు అనే మాటకు కొత్త అర్థం చెప్పారు కమ్యూనిస్టులు. మొదట్లో కమ్యూనిస్టులకు, పవన్ కు మధ్యన సఖ్యత ఉండేది. గత ఎన్నికల్లో పొత్తు కూడ పెట్టుకున్నారు. వామపక్ష పార్టీలు ప్రధానంగా పవన్ ను నమ్మడానికి కారణం ఎన్నికల ముందు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉండటమే. అందుకే వారు జనసేనతో చేతులు కలిపారు. సుదీర్ఘ కాలం స్నేహం చేయాలని అనుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం వ్యవహారం బెడిసికొట్టింది,
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పరిణామం కమ్యూనిస్టులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ పవన్, చంద్రబాబు, జగన్ మూలంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేశారని అన్నారు. ఇక్కడ మూడు పెళ్లిళ్లు అంటే వ్యక్తిగత జీవితంలోని పెళ్లిళ్లు కాదు బీజేపీ, టీడీపీ, వైసీపీలతో అంటకాగడం అన్నమాట. బీజేపీతో జనసేన ఎలాగూ పొత్తులో ఉంది. టీడీపీ బీజేపీ స్నేహ హస్తం కోసం వెంపర్లాడుతోంది. ఇక పాలకపక్షం వైసీపీ జాతీయస్థాయిలో బీజేపీకి సహకరిస్తోంది. కాబట్టి పవన్ ఆ మూడు పార్టీలతో కుమ్మక్కయ్యారనేది నారాయణగారి అభిప్రాయం. అందుకే మూడు పెళ్లిళ్లు అనే మాట వాడారిక్కడ.