Covid Third Wave : కొంప ముంచుతున్న కోవిడ్ కొత్త వేవ్.! ఈ పాపం ఎవరిది.?

Covid Third Wave : కోవిడ్ కొత్త వేవ్ దేశాన్ని కమ్మేసింది. టెస్టుల సంఖ్య పెంచితే, ఈపాటికే ఐదు నుంచి పది లక్షల దాకా రోజువారీ కేసులు నమోదయ్యేవేమో. చాలా రాష్ట్రాలు తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నాయి. అలా తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అలాగని తెలంగాణ ఏమీ ఎక్కువ టెస్టులు చేసెయ్యట్లేదు.. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కాస్త ఎక్కువ టెస్టులు తెలంగాణలో జరుగుతున్నాయంతే.

అయినా, టెస్టుల సంఖ్య పెంచేస్తే ఏం లాభం.? ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తేనే కదా కోవిడ్ వైరస్‌కి కట్టడి వేయగలం.? కానీ, అంత జాగ్రత్త ఎవరిలోనూ కనిపించడంలేదు. క్రిస్‌మస్ అలా న్యూ ఇయర్ సందర్భంగా చేసుకున్న పార్టీలు, వేడుకలే ఇప్పుడీ కోవిడ్ సునామీకి కారణమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అందులో నిజం లేకపోలేదు కూడా.

మరోపక్క, రాజకీయ పార్టీలు చేస్తున్న, చేసిన హడావిడి కూడా కోవిడ్ విలయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. మాస్కులు పెట్టుకోండి.. భౌతిక దూరం పాటించండి.. ఒక లేయర్ సరిపోదు, రెండు మూడు లేయర్ల మాస్కులు.. వీలైతే మాస్కు మీద మాస్కు ధరించండంటూ ఇప్పుడు జాగ్రత్త కబుర్లు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు.

ఇదిలా వుంటే, సినీ పరిశ్రమలో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది. సెలబ్రిటీలు ఒకరొకరుగా కరోనా బారిన పడుతున్నారు. దాంతో, సినిమా షూటింగులు ఆగిపోతున్నాయి. ‘అబ్బే, ఒమిక్రాన్ వల్ల పెద్దగా ప్రమాదం లేదు..’ అని కొందరు చెబుతున్నా, గత అనుభవాల నేపథ్యంలో రిస్క్ చేసేందుకు సెలబ్రిటీలు ఇష్టపడటంలేదట.

ఈ జాగ్రత్త ఏదో ముందుగా వుండి వుంటే, కోవిడ్ ఇంతలా విజృంభించి వుండేది కాదేమో.!