Covid Shock : బాధ్యతా రాహిత్యం: కరోనా అందుకే రాజకీయ నాయకుల్ని కాటేస్తోందా.?

Covid Shock :  దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రధానంగా రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అందుక్కారణం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే. మొన్నామధ్య తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకులు పబ్లిసిటీ స్టంట్లు చేశారు. ఫలితం, పలువురు బీజేపీ నేతలు కరోనా బారిన పడ్డారు, పడుతూనే వున్నారు. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రభుత్వాలు విధిస్తోన్న కరోనా నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమే. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. అంటూ సామాన్యుల నుంచి జరీమానాలు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకుల ముక్కు పిండి జరీమానాల్ని వసూలు చేయగలవా.? అన్న ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

ఇదిలా వుంటే, ఏపీకి చెందిన మంత్రి కొడాలి నాని కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందుతోంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ కూడా కోవిడ్ బారిన పడి, హైద్రాబాద్‌లోనే వైద్య చికిత్స పొందుతున్నారు.

రాజకీయ నాయకులు హైద్రాబాద్ కాకపోతే చెన్నయ్.. వీలైతే విదేశాలకు వెళ్ళి అయినా వైద్య చికిత్స పొందుతారు. సామాన్యుల పరిస్థితి అలా కాదు కదా.? కోవిడ్ మొదటి వేవ్, రెండో వేవ్‌తో పోల్చితే.. మూడో వేవ్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఎక్కువమందికి కోవిడ్ సోకుతోంది.

‘మూడో వేవ్ సందర్భంగా మెజార్టీ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందినవే..’ అని వైద్య నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, అధికారిక లెక్కల్లో ఒమిక్రాన్ వేరియంట్ పేరు చెప్పి తక్కువ లెక్కలే చూపిస్తున్నారు.

ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎలాంటి పబ్లిసిటీ స్టంట్లు అయినా చేయొచ్చగాక.. కానీ, బాధ్యతగా వుండాల్సింది ప్రజలే. ఎందుకంటే, ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు.