AP Govt Employees : నాన్సెన్స్.! కోవిడ్ విజృంభిస్తున్న వేళ.. ఈ ఆందోళనలేంటి.?

AP Govt Employees : వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాలు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. ఇదెక్కడి పీఆర్సీ.? అంటూ ఉద్యోగులు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే గొప్ప పీఆర్సీ.. అంటోంది జగన్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 20 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా, ఉద్యోగుల మేలు కోరి ఈ పీఆర్సీ ప్రకటించామన్నది ప్రభుత్వ వాదన.

ఉద్యోగులు మాత్రం, ఎక్కడన్నా కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయిగానీ, తగ్గడమేంటి.? అని ఉద్యోగులు వాపోతున్నారు. సరే, ఎవరి వాదన వారిదే. ఉద్యోగులు, ప్రభుత్వానికి సహకరించాలి. పైగా, ఇది కోవిడ్ పాండమిక్ పరిస్థితి. రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడమేంటి.?

తమ ఆందోళనలతో కోవిడ్ మరింతగా వ్యాప్తి చెందితే, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారన్న కనీస సోయ ఉద్యోగ సంఘాల నేతల్లో లేకపోవడం శోచనీయం. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే తాజాగా రోడ్డెక్కారు. ఇదొక వింత పరిస్థితిగానే చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు నిర్వహిస్తున్నాయి.

ప్రభుత్వం సైతం, పరిస్థితి ఇంతదాకా వస్తుందని ముందే ఎందుకు అంచనా వేయలేకపోయిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఓ వైపు ఆదాయం పెరిగిందని లెక్కలు చెబుతున్నారు, ఇంకో వైపు ఆదాయం తగ్గిందంటున్నారు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రభుత్వం నుంచే వస్తోంటే, ఉద్యోగుల్లో ఆందోళన ఎందుకు వుండదు.?

సంబంధిత మంత్రులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వుండగా, ఎవరికీ బాధ్యత లేనట్టే వ్యవహరిస్తుండడం ఆశ్చర్యకరం. ముఖ్యమంత్రి తప్ప, ఎవరూ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించలేరా ఇప్పుడున్న పరిస్థితుల్లో.? ఏమోగానీ, ఈ ఆందోళనలు ఇలాగే కొనసాగితే అది రాష్ట్రానికే ప్రమాదకరం కరోనా తీవ్రత కోణంలో.