AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గాయా.? పెరిగాయా.?

AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల విషయమై గందరగోళం కొనసాగుతోంది. వైసీపీ మద్దతుదారులేమో, ఉద్యోగుల వేతనాలు పెరిగాయనీ, కొత్త పీఆర్సీతోనే ఇది సాధ్యమయ్యిందని చెబుతూ సోషల్ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించిన కొన్ని పే స్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, ఉద్యోగుల వాదన మాత్రం, ‘మా జీతాలు పెరగలేదు, తగ్గాయ్..’ అంటున్నారు. చాలామంది ఉద్యోగులు తమకు ఇంకా జీతాలే అందలేదని చెబుతుండడం గమనార్హం. ‘ఏ ఒక్కరికీ జీతాలు తగ్గవు, పెరుగుతాయ్.. ఉద్యోగుల జీతాలు పెరగకపోతే, ప్రభుత్వంపై 20 వేల కోట్ల రూపాయల భారమెలా పడుతుంది.?’ అన్నది ప్రభుత్వ పెద్దల నుంచి వస్తోన్న ప్రశ్న.

కాగా, ప్రచారంలో వున్న లెక్కల ప్రకారం, ఉద్యోగుల జీతాలు తగ్గినట్లే కనిపిస్తోంది. అదెలా సాధ్యం.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘ముఖ్యమంత్రిని నమ్మి మోసపోయాం..’ అని కొందరు ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతోంటే, ‘సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి తప్పుడు సలహాలిచ్చి, ఉద్యోగుల పొట్ట కొడుతున్నారు..’ అని కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు.

అసలు ఉద్యోగుల జీతాలు పూర్తిగా పడ్డాయా.? ఉద్యోగులకు జీతాలు పెరిగాయా.? లేదా.? ఈ అంశాలపై ప్రభుత్వమే సవివరమైన ప్రకటన చేయాల్సి వుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఓ శ్వేత పత్రం విడుదల చేస్తే, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.

కాగా, ఉద్యోగ సంఘాల ఆందోళనల్లో వైసీపీ మద్దుతుదారులూ కనిపిస్తున్నారు. ‘మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. కానీ, మా జీవితాలు నాశనమైపోతున్న దరిమిలా పోరాటం చేయాల్సి వస్తోంది..’ అంటూ వ్యాఖ్యానిస్తున్న దరిమిలా, ఈ ఉద్యమం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆవేదన, ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది.