AP Govt Employees : ఉద్యోగుల లెక్కలు పక్కగానే వున్నాయ్‌గానీ.!

AP Govt Employees :  ఉద్యోగులు సమ్మె చేస్తే నష్టపోయేది ఎవరు.? ఇంకెవరు ప్రజలే.. ఆ ప్రజల్లోనే ఉద్యోగులు కూడా వుంటారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తోందిగానీ, ఉద్యోగులు మాత్రం చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదంటున్నారు. ‘చర్చలకు పిలుస్తారు.. కాఫీ, టీ, బిస్కట్లు ఇచ్చి పంపించేస్తారు.. ఆ మాత్రందానికి చర్చలెందుకు.?’ అన్నది ఉద్యోగుల వాదన.

మరి, ఆందోళనలతో సమస్యకు పరిష్కారమవుతుందా.? సమ్మె చేస్తే మేలు జరుగుతుందా.? ఈ విషయమై ఉద్యోగుల వద్దనే స్పష్టత లేదు. ‘పోరాడి సాధించుకుంటాం..’ అన్నది ఉద్యోగుల వాదన. పోరాడితే, రాష్ట్రం నష్టపోతుంది. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మరింతగా కష్టపడాల్సి వస్తుంది.

ఇక, ప్రభుత్వం నుంచి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలే వస్తుండడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ విజయవంతమైంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగులకు సహకరించాయనడంలో అర్థమే లేదు.

కాగా, అప్పుడే పెన్ డౌన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కంప్యూటర్ల షట్ డౌన్ కూడా షురూ అయ్యింది. సమ్మె ఒక్కటే మిగిలి వుంది. అది కూడా షురూ అవబోతోంది. ఒక్కసారి సమ్మె మొదలైతే, ఆ తర్వాత పరిస్థితులు వేగంగా దిగజారిపోతాయి. ఇప్పటికే చర్చలకు వీల్లేనంతగా వాతావరణం వేడెక్కిపోయింది.

వేతనాలు తగ్గాయంటూ ఉద్యోగులు లెక్కలతో సహా చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం వేరే లెక్కలు చెబుతోంది. ఎవరికి వారు తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళంటే ఎలా.? ఈ విషయమై మధ్యవర్తిత్వం అవసరం. కానీ, సలహాదారులుగా పిలవబడుతున్నవారెవరూ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించకపోవడం శోచనీయం.