CBN And Ys Jagan : లౌక్యం తెలియకపోవడమే వైఎస్ జగన్‌కి శాపం.!

CBN And Ys Jagan : అధికారంలో వున్నవారికి, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఒక్కటే వుంటే సరిపోదు. దాంతోపాటుగా, ఒకింత లౌక్యం కూడా తెలిసి వుండాలి. లౌక్యం తెలియకపోతే చాలా చాలా కష్టం. చంద్రబాబుకి వున్న లౌక్యంతో పోల్చితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా చాలా వీక్.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

ఉద్యోగుల ఆందోళనల విషయానికొస్తే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక్కడే ఉద్యోగ సంఘాల నేతలకూ ఒకింత ‘చికాకు’ కలుగుతోంది. చంద్రబాబు హయాంలో అశోక్ బాబు, చంద్రబాబు కోసం పనిచేసేవారు. అలా ఇప్పుడున్న ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఎవరైనా వైఎస్ జగన్ సొంత మనిషిలా వ్యవహరిస్తున్నారా.? లేదే.! అలా ఎందుకు ఓ నాయకుడ్ని వైసీపీ తయారు చేసుకోలేకపోయిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఉద్యోగ సంఘాల నాయకుల్లో వెంకట్రామిరెడ్డి అనే ఒకాయన చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మొదట్లో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించేశారు. పీఆర్సీ వ్యవహారానికి సంబంధించి తొలుత ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పింది ఈయనే. మిగతా ఉద్యోగ సంఘాల నాయకులతోనూ థ్యాంక్స్ చెప్పించింది వెంకట్రామిరెడ్డే. కానీ, ఎక్కడో తేడా కొట్టేసింది.

ఉద్యోగులు పాత పీఆర్సీతోనే వేతనాలు ఇవ్వమన్నప్పుడు, ముఖ్యమంత్రి ‘లౌక్యం’తో వ్యవహరించి వుండాల్సింది. కొత్త పీఆర్సీ అమలుని ఓ నెల రోజులు వాయిదా వేసి వుంటే, ఉద్యోగులసలు ఉద్యమించేవారే కాదేమో. కానీ, ‘మేం ఉద్ధరించేస్తున్నాం..’ అని చెప్పుకోవడానికి, ప్రభుత్వ పెద్దలు తొందరపడ్డారు. దాంతో, ‘ప్రజా వ్యతిరేకత’ బయటపడిపోయింది.

‘అబ్బే, అది ప్రజా వ్యతిరేకత కాదు. చంద్రబాబు దర్శకత్వంలో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన షో..’ అని వైసీపీ విమర్శిస్తుండొచ్చుగాక. కాస్త లౌక్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేదే కాదు. ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నట్లుగా ప్రభుత్వం దిగి రావడంతో, ప్రభుత్వం ఇక్కడ ఓటమి చవిచూసిందనే భావన అంతటా వ్యక్తమవుతోంది.