Covid Mafia : కోవిడ్ మాఫియా: ఈసారి ‘ఒమిక్రాన్’ పేరుతో దోపిడీ.!

Covid Mafia : దోపిడీ మొదలైంది.. కోవిడ్ 19 పాండమిక్ రెండో వేవ్ సమయంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్లు సహా చాలా మందుల పేరుతో మెడికల్ మాఫియా ఎలా చెలరేగిపోయిందో చూశాం. ఆక్సిజన్ దోపిడీ సంగతి సరే సరి. అయితే, ప్రస్తుతానికి.. ఒమిక్రాన్ సీజన్ సందర్భంగా అలాంటి మాఫియాలు, దోపిడీల గురించి పెద్దగా చర్చ జరగడంలేదు.

రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఎక్కువమంది ఆసుపత్రి పాలవకపోవడంతో ‘దోపిడీ’ మరీ ఎక్కువగా ఏమీ లేదని అనుకోవాలేమో. కానీ, తెరవెనుకాల దోపిడీ జరుగుతోంది. ఆ దోపిడీ గురించిన వార్తలు మాత్రం బయటకు రావడంలేదంతే.

ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ధరను 350 రూపాయలుగా నిర్ధారిస్తే, ఈ ధర వెయ్యి రూపాయలు, ఆ పైనే వుంది కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాల్లో. ఈ విషయమై ఇప్పుడిప్పుడే మీడియాలోనూ చలనమొచ్చింది. కింది స్థాయిలో నిఘా పెట్టి, దోపిడీని బయటకు తీస్తోంది. ప్రభుత్వమే ఈ విషయమై ఇంకా చర్యలు తీసుకోవాల్సి వుంది.

తెలంగాణలోనూ కోవిడ్ 19 టెస్టుల నిమిత్తం దోపిడీ జరుగుతూనే వుంది. చాలామంది ఇంటి వద్దనే వైద్య చికిత్స పొందుతుండడంతో ప్రైవేటు వైద్యులు అడ్డంగా దోచేస్తున్నారు. రకరకాల పరీక్షల పేరుతో కోవిడ్ బాధితుల జేబులు గుల్ల చేసేస్తున్నారు.

అన్నట్టు, ‘ఆనందయ్య మందు’ పేరుతోనూ దోపిడీ యధేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లు.. ఒకటేమిటి, మార్కెట్లో చాలా మందులు, ఇతర మెడికల్ అవసరాలకు సంబంధించినవి అధిక రేట్లకు అమ్ముడవుతున్నాయి.

ఏదిఏమైనా కరోనా వైరస్ కంటే భయంకరమైనది మెడికల్ మాఫియా. ఈ మాఫియాకి మాత్రం మందు కనిపెట్టలేకపోతున్నాం.