Covid Guidelines: నూతన మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం.. 5 సంవత్సరాలలోపు పిల్లలకు మాస్కులు అవసరం లేదు..!

Covid Guidelines: దేశంలో కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకవైపు కోవిడ్ 19 కేసులు, మరొకవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న ఆయుధం మాస్క్, శానిటైజర్ లు వాడటం, భౌతిక దూరం పాటించడం.

18 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలలో కరోనా వైరస్ తీవ్రత, క్లినికల్ డ్రగ్స్ తో కూడిన ట్రీట్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలలో కొన్ని సవరణలు చేసి 18 సంవత్సరాలలోపు ఉన్నవారిలో చికిత్స విధానం గురించి తెలియజేశారు. ఇందులో 12 సంవత్సరాలు పైబడిన పిల్లలను పెద్దవారి లాగా మాస్కు వేసుకోవాలని సూచించారు. 6 నుండి 11 సంవత్సరాలు పిల్లలు పెద్దల పర్యవేక్షణలో తగిన విధంగా మాస్కు ధరించాలి అని సూచిస్తున్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మాస్క్ వేసుకోవడం సరిగా రాదని, వారికి మాస్క్ అవసరం లేదని ఈ మార్గదర్శకాలలో తెలియజేశారు.

ఇటీవలి కాలంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ కేంద్ర వైద్య బృందం సమీక్షించి ఇది మిగిలిన దేశాల కంటే మన దేశం మీద ప్రభావం తక్కువ చూపుతోందని తెలియజేసింది. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది కనుక తగిన జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వ్యాధిని లక్షణాలు లేనివి, స్వల్ప లక్షణాలు, తీవ్ర లక్షణాలు ఇలా మూడు విధాలుగా వర్గీకరించారు. లక్షణాల తీవ్రతను బట్టి, దానికి ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా అవసరమో ఈ మార్గదర్శకాలలో వెల్లడించారు.

చికిత్స కోసం ఉపయోగించే స్టెరాయిడ్ లను, సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన వ్యవధిలో ఉపయోగిస్తే తగిన ఫలితాలు లభిస్తాయని ఈ మార్గదర్శకాలలో తెలియజేశారు. ఈ మార్గదర్శకాలను ఇంకా సమీక్షించి కొత్త లక్షణాలు వాటికి అవసరమైన చికిత్స ఏవిధంగా చేసుకోవాలి త్వరలో మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.