రాష్ట్రాలకు 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని కేంద్రం ఇచ్చేసిందట.. అంతేనా.?

20 Cr Vaccines delivered to States from center for free

20 Cr Vaccines delivered to States from center for free

రాష్ట్రం వేరు.. కేంద్రం వేరు.. అనుకోగలిగిన పరిస్థితేనా ఇది.? అసలు ప్రపంచమంతా ఒక్కటై కరోనా వైరస్ ముందు సాగిలా పడాల్సిన దుస్థితి ఇది. ఓ దేశం, ఇంకో దేశానికి సహకరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సినేషన్ విషయమై రాష్ట్రాల్ని ఉద్ధరించేశాం, ఉచితంగా వ్యాక్సిన్ అందించాం.. అని కేంద్రం చెప్పుకుంటే ఎలా వుంటుంది.? వినడానికి అస్సలేమాత్రం బాగోదు. కానీ, దాన్నొక ఘనకార్యంలా ప్రకటించేసుకుంటోంది కేంద్రం. 20 కోట్ల డోసుల్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా ఇచ్చేసిందట ఇప్పటిదాకా. 2 కోట్ల డోసులు ఇంకా ఆయా రాష్ట్రాల వద్ద వినియోగించకుండా వున్నాయట. కేంద్రం తాజాగా వెల్లడించిన లెక్కలు.. చెప్పుకుంటోన్న గొప్పలు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. నిజానికి, దేశంలో 140 కోట్ల మంది భారతీయులున్నారు.. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, కొన్ని డోసుల్ని మాత్రమే కేంద్రం, రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తామంటోంది.

రాష్ట్రాలు తమకు అవసరమైన మేర వ్యాక్సిన్లను కొనుక్కోవాలని చెబుతోంది. అంతేనా, ప్రైవేటు ఆసుపత్రులు కూడా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తూ, సామాన్యుడి జేబులు ఖాళీ చేసే ప్రక్రియకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేంద్రం 20 కోట్ల డోసులు ఉచితంగా ఇచ్చినా, 140 కోట్ల మందికి రెండు డోసులు.. అంటే మొత్తంగా 240 కోట్ల డోసులు ఉచితంగా ఇచ్చినా.. అందుకోసం వెచ్చించేది ప్రజా ధనమే. పన్నుల రూపంలో ఆ మొత్తాన్ని ఎలాగూ కేంద్రం తిరిగి ప్రజల నుంచే రాబడుతుంది. అయితే, కేంద్రం ఒక్కటే వ్యాక్సిన్లను సమకూర్చుకోవడమంటే కొంత ఇబ్బంది వుండొచ్చు. అందుకోసం రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తుండొచ్చు. వైద్య ఆరోగ్య రంగానికి పెద్దయెత్తున ఖర్చు చేస్తోన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ కరోనా విపత్తు నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తే నష్టమేంటి.? కొన్ని రాష్ట్రాలు అలా ముందుకొస్తున్నప్పటికీ.. ఇది పూర్తిగా కేంద్రం బాధ్యతే.