Covid Festival : ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పడగ: పండగ ఎఫెక్టుతో ఒకే రోజు 10 వేలు.!

Covid Festival :  సంక్రాంతి పండగక్కి చుట్టాలు, బంధువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. ఫలితంగానే కోవిడ్ ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోందా.? అంటే, ఔననే అనుకోవాలేమో. సరే, కోవిడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలేమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం.. ప్రభుత్వం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం.. ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలే.

ఒక్క రోజులో కోవిడ్ 19 కొత్త కేసుల సంఖ్య పదివేలు అంటే చిన్న మాట కాదు. పైగా, కోవిడ్ టెస్టులు కనీసం 50 వేలు కూడా దాటలేదాయె. సుమారు నలభై వేల టెస్టులకే 10 వేల పాజిటివ్ కేసులు వచ్చాయంటే, ఆషామాషీ వ్యవహారం కాదు. కోవిడ్ పడగ ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

సంక్రాంతి కోడి పందాలు కూడా కోవిడ్ 19 ఈ స్థాయిలో విజృంభించడానికి కారణం. చాలా చోట్ల నిర్వహించిన కాసినోలు, ఇతరత్రా గ్యాంబ్లింగ్ కార్యక్రమాలు.. వీటితోపాటుగా సంక్రాంతి సంబరాలు.. ఇవన్నీ కోవిడ్ వ్యాప్తికి కారణం. ఇంతకీ, ప్రభుత్వం ఏం చేయగలిగింది.? అంటే, ఏమీ చేయలేదు.. పండగ కదా.. అన్న కోణంలో కోవిడ్ నిబంధనల అమలుని లైట్ తీసుకుంది.

ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టి ఏం లాభం.? ప్రజల్లోకి కోవిడ్ చాలా వేగంగా వెళ్ళిపోయింది. ‘ఈసారి ఆసుపత్రి చేరికలు తక్కువే..’ అన్న ప్రచారంతో జనం కోవిడ్‌ని పూర్తిగా లైట్ తీసుకున్నారు. అయితే, క్రమంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే.

అధికార పార్టీకి చెందిన నేతలు కోవిడ్ వచ్చిందనగానే వైద్య చికిత్స కోసం హైద్రాబాద్ పరుగులు తీస్తున్నారు. మరి, సామాన్యుల పరిస్థితేమంటి.? గతంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లోనే ఏపీ నుంచి వచ్చే అంబులెన్సుల్ని అడ్డుకోవడం అప్పట్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.