ఆంధ్రప్రదేశ్‌లో కోరోనా టెస్టులెందుకు పెరగట్లేదు.?

Covid 19: Why Very Low Testing In Andhra Pradesh?
Covid 19: Why Very Low Testing In Andhra Pradesh?
 
పొరుగు రాష్ట్రం తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ లక్షకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అదే, ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, టెస్టుల సంఖ్య 30 నుంచి 35 వేల లోపు మాత్రమే జరుగుతున్నాయి. టెస్టుల సంఖ్య ఇలా వుంటే, తాజాగా ఈ రోజు తెలంగాణలో దాదాపు 4 వేల కేసులు నమోదయ్యాయి. అదీ దాదాపు లక్షా పాతిక వేల టెస్టులకి. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో దాదాపు 6 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. అదీ కేవలం 35 వేల టెస్టులకి మాత్రమే. అంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు, తెలంగాణ కంటే చాలా చాలా ఎక్కువగా, అత్యంత ప్రమాదకరంగా వుందన్నమాట. తెలంగాణకు లేని గొప్ప అవకాశం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు. మరి, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు ఎక్కువగా జరగడంలేదు.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు, దానికి అనుగుణంగా టెస్టుల సంఖ్య కూడా పెరిగితే, ట్రేసింగ్ అలాగే ట్రీట్మెంట్ అనేది సులభతరం అవుతుంది.
 
కేంద్రం నుంచి ఇటీవల సుమారు 6 లక్షల కోవిడ్ టీకాలు రాష్ట్రానికి చేరితే, వెను వెంటనే రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు, కరోనా టెస్టులు పెంచడానికి సమస్య ఏంటి.? 35 వేల టెస్టులకే 6 వేల కరోనా పాజిటివ్ కేసులంటే.. లక్ష టెస్టులు చేస్తే, రోజుకి 18 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయా.? ఏమో, ఆ పరిస్థితి నిజంగానే రాష్ట్రంలో వుంటే అది అత్యంత భయానకమైనది. టెస్టింగ్ కిట్స్ కొరత వుంటే, ఆ దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. అవసరమైతే ఇంటింటికీ స్ర్క్రీనింగ్ చేస్తామన్న ప్రభుత్వం, టెస్టుల సంఖ్య విషయమై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే.