వ్యాక్సినేషన్ తర్వాత కూడా కరోనా వైరస్ సోకుతుందా.? అంటే, ‘సోకదు’ అని మాత్రం చెప్పలేకపోతున్నారు వైద్య నిపుణులు. నిజానికి, వ్యాక్సిన్లు.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా వ్యాక్సిన్లు ఆయా వ్యాధులు రాకుండా చేస్తాయి. వచ్చినా, వ్యాధి తీవ్రత తక్కువగా వుండేలా చేస్తాయి. మరి, కరోనా వైరస్ (కోవిడ్ 19) పరిస్థితేంటి.? ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఓ ఉద్యమంలా నడుస్తోంది. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేసేస్తున్నాయి ఆయా దేశాలు. మన దేశంలోనూ వ్యాక్సినేషన్ వేగంగానే సాగుతోంది. వ్యాక్సినేషన్ జరుగుతోంది గనుక, కరోనా వైరస్ తీవ్రత తగ్గాలి. కానీ, తగ్గుతున్న దాఖలాలు కనిపించడంలేదు. అమెరికాలో అయితే, అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కడ రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎందుకిలా.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయిందిప్పుడు. కొన్ని అధ్యయనాలు, కొత్త వేరియంట్లపై వ్యాక్సినేషన్ ప్రభావం పెద్దగా వుండదని అంటున్నాయి.
ఇంకొన్ని అధ్యయనాలు, ప్రస్తుతం అందుబాటులో వున్న వ్యాక్సిన్ల సామర్థ్యమే చాలా తక్కువని చెబుతున్నాయి. వాస్తవానికి, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో వున్న వ్యాక్సిన్లన్నీ అత్యవసర వినియోగం కింద అనుమతి పొందినవే. అంటే, ఇంకా చాలా అధ్యయనాలు జరగాలన్నమాట ఆయా వ్యాక్సిన్లకు సంబంధించి. యావత్ ప్రపంచమే అత్యవసర పరిస్థిని ఎదుర్కొంటోంది కరోనా వైరస్ కారణంగా. ఎప్పుడు ఈ మహమ్మారి మనల్ని వదిలిపెడుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సేఫ్ అయ్యంతవరకు, ప్రపంచంలో ఏ ఒక్కరూ సేఫ్ కాలేరన్నది కరోనా వైరస్ విషయంలో నిపుణులు చెబుతున్న విషయం. ప్రస్తుతానికైతే వ్యాక్సిన్ ఒక్కటే మనకు అందుబాటులో వున్న అస్త్రం. అది సమర్థవంతంగా పనిచేస్తోందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మరో ఆప్షన్ లేదు గనుక.. దాన్నే నమ్మి తీరాలి.