కోవిడ్ 19: ‘టూ-డీజీ’ మెడిసిన్ కూడా వ్యాక్సిన్ బాటలోనే.!

Covid 19 Vaccine & Medicine, Same Price Pattern

Covid 19 Vaccine & Medicine, Same Price Pattern

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్.. ప్రభుత్వం ఇస్తే ఉచితం.. ప్రైవేటుగా కొనుక్కుంటే గూబ వాచిపోయే ధర. కేంద్ర ప్రభుత్వానికైతే ఓ ధర.. రాష్ట్ర ప్రభుత్వానికైతే ఇంకో ధర.. ఇదీ వ్యాక్సిన్ తయారీ సంస్థల తీరు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో సామాన్యుడికి అర్థం కావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉచితం’ అని చెబుతున్నా, వాటి కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు.. తిరిగి ప్రజల ముక్కుపిండి (పన్నుల రూపంలో) వసూలు చేయాల్సిందే. సరే, ఆ సంగతి పక్కన పెడదాం.. ఒకే వ్యాక్సిన్.. కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రానికి మరో రేటు.. నేరుగా ప్రజలకైతే మరో రేటు ఎందుకు.? అన్నదానికి సరైన సమాధానం ఇంకా దొరకలేదు.. భవిష్యత్తులో దొరకదు కూడా. తాజాగా, కరోనా వైరస్ సోకినవానికి చికిత్సలో సహకరిస్తుందంటూ డీ.ఆర్.డి.వో. రూపొందించిన ‘టూ-డీజీ’ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మెడిసిన్ ధరను కూడా ప్రకటించేశారు. ధర దాదాపు వెయ్యి రూపాయలు.

ఖచ్చితంగా చెప్పాలంటే 990 రూపాయలు. ఇదే మెడిసిన్, కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం రాయితీ ధరకు ఇవ్వబోతున్నారట. రెడ్డీస్ ల్యాబోరేటరీస్, డీ.ఆర్.డీ.ఓ. ఈ మందుని అందుబాటులోకి తెచ్చాయి. అదేంటీ, ఒకే మందు.. ప్రభుత్వానికైతే ఓ ధర.. ప్రజలకు నేరుగా అయితే ఇంకో ధర.? ఈ మాయాజాలం ఏంటన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. కరోనా దెబ్బకి సామాన్యుడైనా ఒకటే.. డబ్బున్నోడైనా ఒకటేనని తేలిపోయింది. కొంతమందికి ఎలాంటి లక్షణాలూ వుండడంలేదు.. కొందరికి ఎంత ఖర్చు చేసినా ఫలితం వుండడంలేదు. డబ్బున్నోడు, డబ్బు లోనోడు.. అనే తేడా చూపించడంలేదు కరోనా వైరస్. కరోనా వైరస్ కంటే దారుణంగా వున్నాయి ఈ దరల తేడాలు. చూస్తోంటే, కరోనా పేరు చెప్పి దోచేయడానికి ఈ సులభతరమైన మార్గాన్ని వ్యాక్సిన్ లేదా మెడిసిన్ తయారీదారులు ఎంచుకున్నారా.? దానికి ప్రభుత్వాల అండదండలున్నాయా.? అన్న అనుమానాలు కలగకుండా ఎలా వుంటాయ్.?