ఆల్వేజ్ బీ పాజిటివ్.. అంటుంటాం. కానీ, కోవిడ్ 19 వచ్చాక ‘పాజిటివ్’ అన్న మాట వినాలంటేనే భయమేస్తోంది. ‘అది నీకు బాగా ప్లస్ అయ్యింది రా..’ అని ఇప్పటిదాకా ఎవర్నయినా ఉద్దేశించి అనేవాళ్ళం. ఇకపై అలా అనడానికి కూడా వీల్లేదు. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిందంటే అంతే సంగతులు.. నెగెటివ్ వచ్చినా.. అది ఫాల్స్ నెగెటివ్ అయ్యే ప్రమాదం వుంది. ఇక, కోవిడ్ 19 ప్లస్ అంటున్నారు. ఇది ఇంకా తీవ్రమైనదట.
కోవిడ్ 19 ప్లస్ అంటే, కోవిడ్ వచ్చి, తగ్గాక తలెత్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలట. జీవితాంతం వీటిల్లో కొన్ని వేధించే అవకాశం వుందట. అంటే, మనిషి బతకడం దండగన్నమాట.. కోవిడ్ సోకిన తర్వాత. ఇక, కోవిడ్ 19 వేరియంట్లలో కొత్త వేరియంట్ ‘డెల్టా’ అతి ప్రమాదకరమైనదని అంటున్నారు. ఈ డెల్టా వేరియంట్, భారతదేశంలో రెండో వేవ్ రావడానికి కారణమయ్యింది.
డెల్టా వేరియంట్ అంత్యంత ప్రమాదకరంగా విస్తరించింది దేశంలో. ఇప్పుడు దీనికి మళ్ళీ ‘డెల్టా వేరియంట్ ప్లస్’ అనే వేరియంట్ కొత్తగా పుట్టుకొచ్చిందట. దీని ప్రభావం కూడా చాలా ఎక్కువే వుండబోతోందని హెచ్చరిస్తున్నారు. ఒక్కోటీ సుమారు 60 వేల రూపాయల విలువైన ఇంజెక్షన్లు (ఇమ్యునో థెరపీ.. అంటున్నారు) ఇస్తే, కోవిడ్ నుంచి రెండు మూడు రోజుల్లో కోలుకోవచ్చంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆ ఇంజెక్షన్లకూ ఈ కొత్త వేరియంట్.. అదేనండీ డెల్టా ప్లస్ వేరియంట్ లొంగదట. ఇలాంటి కేసులు భారతదేశంలో ఈ నెల 7వ తేదీ నాటికే ఆరు నమోదయ్యాయట. కోవిడ్ 19కి సంబంధించి అస్సలేమాత్రం వినలేని భయానకమైన వార్తలివి. కోవిడ్ 19 వస్తే చావడం సంగతెలా వున్నా, వీటి గురిచి వింటేనే చచ్చిపోయేలా వున్నాం. భయపెట్టడమే జర్నలిజం అయి చచ్చింది మరి.. మీడియా తీరు ఇప్పుడు.