Covid 19 : కోవిడ్ 19 మూడో వేవ్: విద్యార్థులకు అగ్ని పరీక్షే.!

Covid 19 :  ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయా.? డిగ్రీ పరీక్షల సంగతేంటి.? పోటీ పరీక్షలు ఏమవుతాయి.? విద్యార్థి లోకంలో గుబులు బయల్దేరింది ఈ విషయాలపై. కారణం కోవిడ్ 19 మూడో వేవ్. అబ్బే, అస్సలు భయపడాల్సిన పనిలేదు.. కొత్త వేవ్ వల్ల మరణాలు తక్కువగానే వున్నాయి.. ఆసుపత్రుల్లో చేరే ముప్పు కూడా తక్కువే.. అన్నది ప్రభుత్వాల వాదన.

మొదటి వేవ్, రెండో వేవ్ సందర్బంగా కోవిడ్ మరణాల లెక్క తేల్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. క్రమంగా సవరణలు చేస్తూ వచ్చారు.. మరణాల సంఖ్య ముందు చెప్పినట్లు తక్కువేమీ కాదు.. ఎక్కువే. అనధికారిక లెక్కల ప్రకారమైతే అనూహ్యమైన రీతిలో జనం ప్రాణాలు కోల్పోయారు.

ఒమిక్రాన్ విషయంలోనూ అదే జరగబోతోందా.? ఏమోగానీ, ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరెలా విద్యా సంస్థల్ని తెరచేందుకు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేస్తాయి.?

‘పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే వుంది..’ అని ప్రభుత్వాలు చెప్పేమాటల్ని విశ్వసించలేం. ప్రాణం పోయాక సవాలక్ష షరతులు పెట్టి, ఆర్థిక సాయం చేసే ప్రభుత్వాలు.. విపత్కర పరిస్థితుల్లో చేతులెత్తేయడమన్నది గతంలో చూశాం.

మరి, పరీక్షలు లేకపోతే.. ప్రత్యక్ష బోధనా తరగతులు లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి.? ప్రాణం వుంటేనే చదువైనా, ఉద్యోగాలైనా.! అందుకే, ప్రభుత్వాలు బేషజాలకు పోవాల్సిన పనిలేదు. ఓ వారం లేదా రెండు వారాల పాటు విద్యార్థుల్ని ప్రత్యక్ష బోధనకు దూరంగా వుంచడమే మేలు. కాదని మొండికేస్తే, కోవిడ్ వల్ల ఒక్క ప్రాణం పోయినా.. అది ప్రభుత్వ హత్యే అవుతుంది.