సెకెండ్ వేవ్ తగ్గుతోంది.. ఇకపై కోవిడ్ 19 సాధారణ రోగమేనా.?

Covid 19 To Become Seasonal Health Problem?
Covid 19 To Become Seasonal Health Problem?
కొన్నాళ్ళ క్రితం కొందరు వైద్య నిపుణులు కరోనా వైరస్.. ఓ సాధారణ రోగంలా మారిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరైతే, కరోనా వైరస్ వచ్చిపోతుంది.. ఎక్కువ కాలం వుండదన్నారు. నిజానికి, ఎవరికీ కరోనా వైరస్ పట్ల సంపూర్ణ అవగాహన లేదు. ఈ వైరస్ మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుంది. ఇదిలా వుంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుతోంది. రేపో మాపో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల లోపుకి పడిపోవచ్చు. చాలా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మరోపక్క, కరోనా బాధితులకు వివిధ దశల్లో చికిత్స అందించేందుకు వినియోగించే మందుల్ని పెద్దయెత్తున రాష్ట్రాలకు అందిస్తోంది కేంద్రం.
 
రాష్ట్రాలూ ఆయా మందుల నిల్వల్ని పెంచుకుంటున్నాయి.. విరివిగానే కోవిడ్ బాధితులకు అవి అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అక్కడా ఇక్కడా అని తేడా లేదు.. దేశమంతటా కరోనా వ్యాపించేసిన దరిమిలా, దీన్ని ఇకపై ఓ సాధారణ రోగంగానే భావించాలేమో. అంటే, వస్తుంది.. పోతుంది.. అన్నట్టుగా అన్నమాట. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరందుకుంటే, కరోనా వైరస్ గురించి మరీ అంతగా భయపడాల్సిన పని వుండదు. కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతుల జోరు పెరుగుతోంది. మూడో వేవ్ వచ్చే లోపల ఎక్కువమందికి వ్యాక్సిన్లు వేయగలిగితే మాత్రం, కరోనా వైరస్.. అతి త్వరలోనే దేశం నుంచి అంతర్థానమైపోవచ్చు. అలాగే జరుగుతుందా.? లేదంటే.. ఓ సాధారణ రోగంలా మారి ఎప్పటికప్పుడు జనాన్ని పీల్చి పిప్పి చేస్తుంటుందా.? ఏమో వేచి చూడాల్సిందే.