అదిగదిగో కరోనా మూడో వేవ్.. అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది. కానీ, తెలంగాణలో జులై 1 నుంచి విద్యా సంస్థలు తెరచుకోనున్నాయి. స్కూళ్ళలో పనిచేస్తోన్న టీచర్లు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతోంది స్పెషల్ డ్రైవ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం. మంచి ఆలోచనే ఇది.
కానీ, థర్డ్ వేవ్.. చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుంది కదా.? మరెలా.! ఆంధ్రపదేశ్ రాష్ట్రం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, సుప్రీంకోర్టు సవాలక్ష ప్రశ్నలు వేసింది.
విధిలేక, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణ నుంచి వెనక్కి తగ్గింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా వచ్చే అవకాశం వున్నప్పుడు.. స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థలు తెరిస్తే కరోనా రాదా.? పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థికి కరోనా సోకి ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల పరిహారమివ్వాల్సిందేనని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం, విద్యా సంస్థలు తెరవడం ద్వారా విద్యార్థులకు కరోనా సోకి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అదే కోటి రూపాయలు పరిహారమివ్వాలని ఆదేశిస్తే బావుంటుంది కదా.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
కరోనా నేపథ్యంలో దేశంలో విద్యా వ్యస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిజానికి, అన్ని వ్యవస్థలూ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే వున్నాయి. విద్యావ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకునేందుకు అవకాశం వుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రోత్సాహాన్ని అందించాల్సి వుంది విద్యా రంగానికి.
అంతే తప్ప, విద్యా సంస్థల్ని తెరిచేయాలంటూ..ప్రభుత్వలు ఆదేశాలిచ్చేసి.. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టాలనుకోవడం సబబు కాదు. రెండేళ్ళు వరుసగా ప్రధాన పరీక్షలు రద్దయ్యాయంటే.. వ్యవస్థలో ప్రక్షాళనకు ఇదే సరైన సమయం అని ప్రభుత్వాలకి అర్థమవుతోందా.? లేదా.? విద్య పేరుతో దోపిడీని అరికట్టడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఇంకెప్పుడు దొరుకుతుంది ప్రభుత్వాలకి.?