కోవిడ్ 19 మూడో వేవ్: తెలుగు సినిమా భవిష్యత్తేంటి.?

కోవిడ్ 19 మూడో వేవ్ వచ్చేస్తోందట. వచ్చేస్తోందో, వచ్చేసిందో తెలియదుగానీ.. కోవిడ్ 19 మూడో వేవ్ గురించిన ప్రచారమైతే మీడియాలో జోరుగా సాగుతోంది. మూడో వేవ్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నదానిపై మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా కనిపిస్తున్నాయి.

ఫేస్ మాస్క్ ధరించాలి.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి.. ఎక్కువమంది గుమికూడే చోటకు వెళ్ళకపోవడం మంచిది.. అంటూ వైద్య నిపుణులు మీడియా సాక్షిగా హెచ్చరిస్తున్నారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ మిగిల్చిన నష్టాన్ని జనం మర్చిపోయి, సాధారణ జన జీవనంలోకి వచ్చేశారు.

సినిమా థియేటర్లు ఓ మోస్తరుగా కళకళ్ళాడుతున్నాయి. వినోద కేంద్రాలన్నీ జనంతో నిండిపోతున్నాయి. అయితే, కోవిడ్ 19 భయాలు షురూ అయితే, తొలుత సినిమా థియేటర్లకే దెబ్బ తగులుతుంది. ఆ విషయం.. కోవిడ్ కారణంగా అత్యంత తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ పరిశ్రమకి బాగా తెలుసు.

ముందు ముందు పెద్ద సినిమాల రిలీజులున్నాయ్. ఇంతలోనే కోవిడ్ 19 మూడో వేవ్ భయం షురూ అయ్యింది. త్వరలో విడుదల కాబోతున్న ‘అఖండ’ సినిమాకి కోవిడ్ ముప్పు పెద్దగా వుండకపోవచ్చు. కానీ, ఆ తర్వాత విడుదలయ్యే ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలకు మాత్రం భయం షురూ అయినట్లే.

అన్నట్టు, ‘వి’ అలాగే ‘టక్ జగదీష్’ సినిమాల్ని కోవిడ్ నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేసుకున్న నాని, ఈసారి ‘శ్యామ్ సింగారాయ్’ విషయంలో ఏం చేస్తాడు.? ఒక్క నాని సమస్య కాదిది.. మొత్తం తెలుగు సినిమా.. ఆ మాటకొస్తే, ఇండియన్ సినిమా.. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రపంచ సినిమాదీ కష్టం.
సినిమా రంగం భవిష్యత్తు.. దైవాధీనమంతే.!