కరోనా మూడో వేవ్.. ఇండియాలో అదిగదిగో వచ్చేస్తోంది.!

కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిన తరుణంలోనే మూడో వేవ్ బయల్దేరిందంటూ భారతదేశంలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. మహారాష్ట్రలో ఒక్కసారిగా పసి పిల్లలు కరోనా బారిన పడ్డంతో అప్పట్లో దాన్ని థర్డ్ వేవ్.. అని అభివర్ణించారు. అయితే, ఆ తర్వాత మూడో వేవ్ భయాలు కాస్త సద్దుమణిగాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త అదుపులోనే వున్నాయి. కేరళ తప్ప, దేశమంతా కోవిడ్ 19 కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే భావించాలి. అయితే, కేంద్ర హోం శాఖ పరిధిలోని కమిటీ ఒకటి ఓ నివేదికను కేంద్రానికి పంపింది కరోనా మూడో వేవ్‌కి సంబంధించి. ఈ నివేదిక సారాంశమేంటంటే, కరోనా మూడో వేవ్ అక్టోబర్‌లో తీవ్ర రూపం దాల్చనుందట. అక్టోబర్ అంటే ఎంతో దూరంలో లేదు. ఆగస్ట్ ముగిసిపోతోంది. మరో పది రోజుల్లో సెప్టెంబర్ నెలలోకి ఎంటర్ అవబోతున్నాం.

అంటే, కరోనా మూడో వేవ్‌కి బీజం అప్పుడే పడిపోయినట్లు భావించాలేమో. ఇదిలా వుంటే, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగానే సాగుతోంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగానే సాగుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వైరస్ వచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో జనం వ్యాక్సిన్లు వేసుకోవడానికి ముందుకు రావడంలేదు. మరోపక్క, ఇంటింటికీ వ్యాక్సినేషన్.. అంటూ సరికొత్త రీతిలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను ఆయా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. మొదటి వేవ్, రెండో వేవ్.. దేశాన్ని భయపెట్టాయి.. చాలామందిని బలిగొన్నాయి. మొదటి వేవ్‌తో పోల్చితే, రెండో వేవ్ మరింతగా ఇబ్బంది పెట్టింది. మూడో వేవ్ పరిస్థితి ఎలా వుండబోతోంది.? అది పూర్తిగా మన బిహేవియర్ మీదనే ఆధారపడి వుంటుందన్నది నిర్వివాదాంశం. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకున్న దరిమిలా, మూడో వేవ్ తీవ్రత తక్కువే వుంటుందని ఆశిద్దాం. అంతకు మించి చేయగలిగిందేమీ లేదు. అయితే, చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం భయాందోళనలకు కారణమవుతోంది.