కరోనా దెబ్బకి వణుకుతున్న భారతం.. ఫిడేల్ వాయింపు ఆగదేం.!

Covid 19 Situation Becoming Worse In India

Covid 19 Situation Becoming Worse In India

రోమ్ తగలబడుతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట. భారతదేశంలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కరోనా దెబ్బకి దేశం విలవిల్లాడుతోంది. ఏకంగా నిన్న (ఏప్రిల్ 13) దేశంలో ఒక లక్షా ఎనభై నాలుగు వేల కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా వైరస్ వెలుగు చూశాక దేశంలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇది. నిజానికి, ప్రతిరోజూ దాదాపుగా సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది భారతదేశం కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పరంగా ఇటీవలి కాలంలో.

ఒకప్పుడు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కేసులున్నప్పుడేమో లాక్ డౌన్.. అనేశారు. ఇప్పుడేమో లాక్ డౌన్ ససేమిరా అంటున్నారు. సరే, లాక్ డౌన్ వల్ల దేశం ఆర్థికంగా కుంగిపోతుందన్న వాదన లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. లాక్ డౌన్ లేకపోతేనేం, ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలి కదా. వినోదం, పర్యాటకం, ఆధ్యాత్మికం.. వంటి విభాగాల్లో జనం గుమికూడకుండా తగు చర్యలు చేపట్టాలి కదా.? తూతూ మంత్రం చర్యలు తప్ప, చిత్తశుద్ధితో కూడిన చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టకపోవడం వల్లే ఇప్పుడీ దుస్థితి.

దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎక్కడా కరోనా నిబంధనల్ని పాటించడంలేదు. ప్రధాని, కేంద్ర మంత్రులు పాల్గొంటున్న ప్రచార కార్యక్రమాల్లోనూ కోవిడ్ నిబంధనల్ని గాలికొదిలేస్తున్నారు. దేశం కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న వైనాన్ని పట్టించుకోకుండా, రాజకీయ ప్రత్యర్థులపైన రాజకీయ అస్త్రాల్ని సంధిస్తున్నారు ప్రధాని మోడీ. నిన్న ఒక్కరోజే దేశంలో ఏకంగా వెయ్యికి పైగా కరోనా మరణాల సంభవించాయి. కొన్ని చోట్ల శవాగారాలు నిండిపోయి పరిస్థితి భీతావహంగా తయారైందంటూ మీడియాలో కథనాలొస్తున్నాయి. జనాభా తగ్గుతుందిలే.. అని పాలకులు సరిపెట్టుకుంటున్నారా.? కరోనా పట్ల పాలకుల్లో చిత్తశుద్ధి ఎందుకు లోపించింది.?