దేశ ఆర్థిక రాజధాని ముంబై.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అక్కడ లాక్ డౌన్ సత్ఫలితాల్నే ఇస్తోంది. అయితే, మహారాష్ట్రలో ఇంకా రోజు వారీ కేసులు 40 వేల పైనే వుంటున్నాయి. ఒకప్పుడు ఈ సంఖ్య 60 వేలు దాటి 70 వేలు వైపు పరుగులు పెట్టిన దరిమిలా, ఇప్పుడు పరిస్థితి కాస్త బెటర్ అనే చెప్పుకోవాలి. మహారాష్ట్రలో లాక్ డౌన్ సక్సెస్ అయిన దరిమిలా, అప్పటిదాకా లాక్ డౌన్ వద్దన్న రాష్ట్రాలు కూడా విధి లేక లాక్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది.
నిజానికి, ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్ లోనే వున్నట్టు లెక్క. కానీ, అధికారికంగా కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించడంలేదు. ఇదిలా వుంటే, దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, నిజంగానే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయా.? లేదంటే, కావాలనే తగ్గించి లెక్కలు చూపిస్తున్నారా.? అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. రికార్డు స్థాయిలో టెస్టులు చేసిన రాష్ట్రాలు, టెస్టుల సంఖ్యని తక్కువ చేయడంలో ఫైనల్ నంబర్ కూడా తగ్గుతోంది. ఇది అస్సలేమాత్రం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే ఒకప్పుడు లక్షా పాతిక వేల టెస్టులు రోజువారీగా చేశారు.. ఇప్పుడేమో 60 నుంచి డెబ్భయ్ వేలకే పరిమితం చేస్తున్నారు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఏదిఏమైనా, కరోనా సెకెండ్ వేవ్ ఒకింత నెమ్మదించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే, మూడో వేవ్ భయాల నేపథ్యంలో రాష్ట్రాలు అలసత్వం ప్రదర్శించకూడదు. యుద్ధాన్ని మరింత గట్టిగా కొనసాగించాల్సిందే. లాక్ డౌన్ నుంచి వెసులుబాట్లు కల్పించడం మొదలు పెడితే, మూడో వేవ్ అతి భయానకంగా వుంటుందనడం నిస్సందేహం.