31,929 కరోనా టెస్టులు.. 3,309 కరోనా పాజిటివ్ కేసులు. శనివారం, ఏప్రిల్ 9వ తేదీన నమోదైన కరోనా లెక్కలివి. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? చిత్తూరు జిల్లాలో అయితే ఒకే రోజు 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 527 కేసులు, విశాఖపట్నంలో 391 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా తదితర జిల్లాల్లోనూ దాదాపుగా 300 కేసులు నమోదయ్యాయంటే కరోనా ఏ స్థాయిలో విస్ఫోటనం చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.
పంచాయితీ, మునిసిపల్, పరిషత్ ఎన్నికల పోరు.. జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నిక హంగామా.. వెరసి, రాష్ట్రంలో అసలేం జరుగుతోందన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. పోనీ, ప్రజలన్నా బాధ్యతగా వుంటున్నారా.? అంటే అదీ లేదు. రాజకీయ నాయకులకైతే ఎటూ బాధ్యత వుండదు. పబ్లిసిటీ కోసం రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తోన్న కార్యక్రమాలే కరోనా విపరీతంగా వ్యాప్తి చెందడానికి కారణమన్న విమర్శలున్నాయి. ఇందులోనూ కొంత నిజం లేకపోలేదు. కరోనా ఇంత తీవ్రంగా విజృంభిస్తున్నా ప్రభుత్వం 31 వేల టెస్టులకే బెంచ్ మార్క్ ఎందుకు పెట్టుకుంటున్నట్లు.? కరోనా టెస్టుల్లో గతంలో బాగా వెనకబడిపోయిన తెలంగాణ ఇప్పుడు రోజుకి లక్ష టెస్టులు చేస్తోంది.
ఆ స్థయిలో ఏపీలో టెస్టులు జరిగితే.. రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. ప్రభుత్వం, ప్రజలు.. బాధ్యతగా వ్యవహరించాల్సి వుందిప్పుడు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ కార్యక్రమాల విషయమై పునరాలోచన చేసుకోవాలి. లేదంటే, మహారాష్ట్రను కరోనా విషయంలో ఏపీ మించిపోయే ప్రమాదమూ లేకపోలేదు.