Covid 19 Omicron : కోవిడ్ 19 ఒమైక్రాన్: ప్రభుత్వాలు చేతులెత్తేశాయా.?

Covid 19 Omicron :  30 శాతానికి పైగా పాజిటివిటీ రేటు.. చిన్న విషయం కాదిది. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 వ్యాప్తి చాలా తీవ్రంగా వుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఇంచుమించు ఇలాగే వుంది.రోజూ 3 లక్షలకు పైన కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. జరుగుతున్న టెస్టుల సంఖ్య చాలా తక్కువగా వుంది. టెస్టులు చేయించుకుంటున్న ప్రతి ఐదుగురిలో ఒకరు లేదా అంతకన్నా ఎక్కువమందికి కోవిడ్ పాజిటివ్ అని తేలడమంటే చిన్న విషయం కాదు.

‘ఆసుపత్రి చేరికలు తక్కువ వుంటున్నాయ్.. మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది..’ అన్న ఒక్క కారణంతో ప్రభుత్వాలు కోవిడ్ పాండమిక్‌ని నిర్లక్ష్యం చేయడం అత్యంత అభ్యంతకరమైన విషయం. ఇంటింటికీ ఫీవర్ సర్వే.. అని చెబుతున్నాయి ప్రభుత్వాలు. ఆ సర్వేల వల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలేంటే అధికారంలో వున్నవాళ్ళకే తెలియాలి.

అసలు తెలుగు రాష్ట్రాల్లో జ్వరం బారిన పడని ఇల్లు కనిపించడంలేదు ఇటీవలి కాలంలో. చలికాలం కావడంతో సాధారణ ఫ్లూ జ్వరాల తాకిడి ఎక్కువగానే వుంటుంది. దానికి తోడు ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని జ్వరాల్నీ కోవిడ్ కేసులని అనలేం. కానీ, అన్ని కోవిడ్ పాజిటివ్ కేసులూ దాదాపుగా ఒమిక్రాన్ వేరియంట్‌వేనన్న చర్చ అయితే జరుగుతోంది.

మొత్తంగా చూస్తే, ప్రభుత్వాలు ఈసారి కోవిడ్ విషయమై చేతులెత్తేశాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. బహిరంగ మార్కెట్‌లో కోవిడ్ పరీక్షల ఖరీదు దగ్గర్నుంచి, ఆసుపత్రుల్లో దోపిడీ వరకు.. దేనిపైనా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపలేకపోతున్నాయి.

గతంతో పోల్చితే, కోవిడ్ సోకినవారు వేగంగా కోలుకుంటుండడం, ప్రాణాపాయం తక్కువగా వుండడం కాస్త ఊరటనిచ్చే అంశం. అంటే, ప్రజల అదృష్టం కొద్దీ కోవిడ్ పెను ముప్పుగా మారట్లేదుగానీ, లేకపోతే.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం, చేతకానితనానికి ఎన్ని ప్రాణాలు పోయి వుండేవో.!