దేశంలో కోవిడ్ 19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. సంఖ్యా పరంగా చూస్తే పెద్దగా పెరుగుదల కనిపించడంలేదుగానీ, చాపకింద నీరులా కోవిడ్ 19 విస్తరిస్తోందన్నది నిర్వివాదాంశం. కరోనా టెస్టుల సంఖ్య తగ్గడం, వైద్య పరీక్షల వైపు కరోనా బాధితులు పెద్దగా దృష్టిపెట్టకపోవడం వెరసి.. దేశంలో కరోనా వేగంగానే విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో అయితే, విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నట్లు మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. హాస్టళ్ళలో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ‘కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ప్రజలంతా అప్రమత్తంగా వుండాలి.. మాస్క్ ధరించాలి.. మాస్క్ ధరించకపోతే జరీమానా తప్పదు..’ అని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
అంతేనా, మాస్క్ పెట్టుకోకపోవడం.. జాగ్రత్తలు పాటించకపోవడమంటే ఆత్మహత్య కిందే లెక్క.. అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించడం గమనార్హం. ఇదిలా వుంటే, దేశంలోకి కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించేసింది. అది ఎంతమందికి వ్యాపించింది.? అన్నదానిపై స్పష్టత లేదు.
ఈ భయాల నడుమ, దేశంలో ఇంకోసారి లాక్ డౌన్ తప్పదేమోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో మారు దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలెలాగూ, ప్రజల మీద పన్నుల మోత మోగించేసి, ఆ తర్వాత పబ్లిసిటీ స్టంట్లు చేస్తాయనుకోండి.. అది వేరే సంగతి.
ప్రజలే అప్రమత్తంగా వుండాలి. హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోవాలి. నిజమే, కరోనా వైరస్ విషయంలో అశ్రద్ధగా వుంటే, అది ఆత్మహత్యా సదృశమే. ఈ విద్యా సంవత్సరం సజావుగా సాగుతుందా.? కోవిడ్ విస్తరిస్తే ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి.? అన్న ఆందోళనలకంటే ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం అత్యుత్తమం.
ప్రభుత్వాలదేముంది.? రాత్రికి రాత్రి లాక్ డౌన్.. అనేస్తారు. ఆ తర్వాత అటు కరోనాతో, ఇటు ఆర్థిక సమస్యలతో ఛావాల్సింది జనమే కదా.!