Covid 19 Omicron : కోవిడ్ 19 మొదటి వేవ్, రెండో వేవ్ ఓ లెక్క.. మూడో వేవ్ ఇంకో లెక్క. వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది గనుక, మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని అనుకున్నారంతా. ఇంతలోనే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిపడింది. వ్యాక్సిన్ వేసుకున్నవారికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకుతోంది. దేశంలో 100కి చేరువలో వున్నాయి ఒమిక్రాన్ కేసుల సంఖ్య. అయితే, ఇంతవరకు మరణాల్లేకపోవడం ఊరట.
కాగా, మూడో వేవ్ పసి పిల్లల మీద పగబడుతుందనే అంచనాలు గతంలోనే వున్నాయి. అయితే, దేశంలో కోవిడ్ 19 వ్యాక్సిన్, పద్ధెనిమిదేళ్ళ లోపు వయసువారికి అందుబాటులో లేదు. పిల్లలకు వ్యాక్సిన్ విషయమై బోల్డంత చర్చ జరుగుతోంది.. కొన్ని దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు కూడా.
ఇతర దేశాలతో పోల్చితే, భారతదేశం పరిస్థితి చాలా భిన్నమైనది. ఇక్కడ జనాభా ఎక్కువ.. వైద్య సౌకర్యాలు అంతంతమాత్రం. పెద్ద సంఖ్యలో యుద్ధ ప్రాతిపదికన ఒకేసారి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే అది దేశంలో సాధ్యమయ్యే పని కాదు. ఒమిక్రాన్ వచ్చేసింది.. పసి పిల్లలకు కూడా ఒమిక్రాన్ సోకే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఏడేళ్ళ చిన్నారికి ఒమిక్రాన్ సోకినట్లు దేశంలో ఓ కేసు రిజిస్టర్ అయ్యింది కూడా.
విద్యా సంస్థలు యధాతథంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దరిమిలా, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఇది. అయితే, ఇంతవరకు ఒమిక్రాన్ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, రాష్టాలకు విద్యార్థుల విషయమై ఎలాంటి సూచనలు చేయకపోవడం, ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం.
‘ఇంట్లో వున్నా మాస్కు ధరించాల్సిందే..’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. చిన్నారులకు వ్యాక్సిన్ విషయమై ప్రభుత్వాల అలసత్వం తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.