కోవిడ్ 19 ఒమైక్రాన్: విద్యార్థుల భవిష్యత్తుపై మళ్ళీ అనుమానాలు.!

ఈ విద్యా సంవత్సరం ఏమవుతుంది.? కరోనా పాండమిక్ నేపథ్యంలో పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోం’ అంటున్నాయి. దాదాపు రెండేళ్ళుగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. జనం గుమికూడి వున్న ప్రాంతాలకు వెళ్ళొద్దని ప్రభుత్వాలే, ప్రజలకు స్పష్టం చేస్తున్నాయి. మరి, విద్యార్థుల సంగతేంటి.?

గడచిన రెండు విద్యా సంవత్సరాలు తీవ్ర గందరగోళం నడుమ నడిచాయి. ఇప్పుడూ అదే పరిస్థితి. పరీక్షలు దగ్గర పడుతున్న దరిమిలా, ‘చదవాలా.? వద్దా.?’ అన్న డైలమాలో పడిపోతున్నారిప్పుడు విద్యార్థులు.. కారణం కోవిడ్ 19 ఒమైక్రాన్.

ఒమైక్రాన్ మన దేశంలోకి కూడా వచ్చేసిందని కేంద్రమే అధికారికంగా ధృవీకరించేసింది. అత్యంత వేగంగా ఈ వైరస్ వేరియంట్ విస్తరిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నుంచి విద్యార్థుల్ని దూరంగా వుంచారు. 18 ఏళ్ళ లోపు చిన్నారులకు ఇప్పటివరకు వ్యాక్సిన్ అందించలేదు.

దాంతో, ఒమైక్రాన్ దెబ్బకి విద్యార్థులే బలైపోయే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కరోనా మొదటి వేవ్ సందర్భంగా వృద్ధులు, రెండో వేరియంట్ కారణంగా మధ్య వయస్కులు, యువత బలైపోతే, మూడో వేవ్ పిల్లల మీద ప్రభావం చూపుతుందని గతంలోనే వైద్య నిపుణులు అంచనా వేశారు.

మరిప్పుడు ఒమైక్రాన్ చిన్నారుల్నే టార్గెట్ చేస్తుందా.? అదే నిజమైతే, విద్యార్థుల పరిస్థితేంటి.? విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వాలు సమాధానం చెప్పలేకపోతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి. అదిప్పుడు వారి పాలిట శాపం కాబోతోందన్నది నిర్వివాదాంశం.

విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఎవరైనా అనుకుంటారు. కానీ, ప్రాణం చాలా విలువైనది కదా.?