చాపకింద నీరులా విస్తరిస్తోనన్న కోవిడ్ 19: మూడో వేవ్ ఇదేనా.?

కోవిడ్ 19 (కరోనా వైరస్) చాపకింద నీరులా విస్తరించేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు కోవిడ్ 19 బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే. తాజగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనాతో బాధపడుతున్నారు.

ఇటీవల పోచారం ఇంట్లో పెళ్ళి వేడుక జరిగింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తనను ఇటీవలి కాలంలో కలిసినవారంతా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలని పోచారం కోరారు. ప్రముఖ సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందిప్పుడు.

ప్రముఖులు కరోనా బారిన పడితేనే మీడియాలో కరోనా గురించిన ప్రచారం జోరుగా సాగుతుంటుంది. లేదంటే అంతా సైలెన్స్. నిజానికి, కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయినాగానీ, అధికారిక లెక్కల్లో వాస్తవాలు కనిపించడంలేదన్న విమర్శలున్నాయి.

‘కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టింది’ అని మాత్రమే అధికారిక బులెటిన్లు చెబుతున్నాయి. మరి, కొత్తగా నమోదవుతున్న కేసుల మాటేమిటి.? ప్రముఖులెందుకు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ 19 తీవ్రత తగ్గుముఖం పట్టిన దరిమిలా, జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. అదే కరోనా మళ్ళీ విజృంభించడానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ వేసుకున్నవారికీ కరోనా సోకుతోంది. కొందరి పరిస్థితి క్రిటికల్‌గా కూడా మారుతోంది. మళ్ళీ ఇంకోసారి లాక్ డౌన్ తప్పదా.. మూడో వేవ్ వచ్చేసిందా.? అన్న భయాలైతే జనాల్లో కొంతమేర కనిపిస్తున్నాయి. కానీ, అటు ప్రభుత్వాల్లో బాధ్యత లేదు.. ఇటు ప్రజలకీ బాధ్యత లేదు. అదే కరోనా వ్యాప్తికి కారణమవుతోంది.