Covid19: దేశంలో కరోనా వైరస్ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. నిజానికి, ఇది అత్యంత భయంకరమైన రికార్డు. భారతదేశం మీద కరోనా వైరస్ ఎందుకింతలా పగలబట్టేసింది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మొదటి వేవ్ సందర్భంగా, రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటలేదు. కానీ, రెండో వేవ్.. అత్యంత వేగంగా, అత్యంత ప్రమాదకరంగా దేశంలో విస్తరించేసింది. మహారాష్ట్రలో అను నిత్యం 60 వేల పైబడి కరోనా పాజిటివ్ కసులు నమోదవుతున్నాయి. నిన్న కర్నాటకలో రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు చేరువయ్యింది.
కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో 30 వేలకు అటూ ఇటూగా కేసులు నమోదవుతున్నాయి అను నిత్యం. రానున్న వారం అత్యంత కీలకం కాబోతోంది. రోజువారీ కేసుల సంఖ్య మరో లక్ష పెరుగుతుందా.? అంతకు మించి పెరుగుతుందా.? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇంతా జరుగుతున్నా, కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతి పాటించలేకపోతున్నాయి. ప్రధానంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా వున్న రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలకు తాత్కాలికంగా సంబంధాలు తెగ్గొట్టలాల్సి వుంది. అదే సమయంలో, కరోనా వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా జరగాలి. ఇవేవీ జరగడంలేదు. ఆక్సిజన్ సిలెండర్ల కొరత, మందుల కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత.. అన్నిటికీ మించి, స్మశానాల్లో అంత్యక్రియలకూ కొరత.. ఇదీ నేటి కరోనా భారతం.
దేశం ఇంతటి దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా, దేశంలో పాలకుల ఫోకస్.. కరోనా మీద కంటే, తమ తమ రాజకీయ ప్రయోజనాల మీదే ఎక్కువగా వున్నట్లు కనిపిస్తోంది. పాలకుల వైఫల్యం అలా వుంటే, ప్రజల వెతలు ఇలా కాకపోతే ఇంకెలా వుంటాయ్.? రోజువారీ 5 లక్షలు కాదు, అంతకు మించి.. 10 లక్షలకు చేరువయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ పలు అధ్యయనాలు అంచనా వేస్తున్న దరిమిలా, దేశం ఎలా ఈ దారుణ పరిస్థితిని తట్టుకుంటుందో మరి.?