దేశంలో కరోనా వైరస్ అదుపులోనే వుందా.?

దేశంలో శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందనీ, కరోనా వైరస్ ప్రస్తుతానికి అదుపులోనే వుందనీ, అయితే.. పూర్తిగా తగ్గిపోలేదనీ, మూడో ముప్పు ఇంకా పొంచి వుందని కేంద్రం చెబుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గిన మాట వాస్తవం. 4 లక్షల మార్కు దాటిన రోజువారీ కోవిడ్ 19 కేసుల సంఖ్య, ఇప్పుడు 40 వేలకు అటూ ఇటూగా వుంటోంది. అయితే, చాలా రోజులుగా ఈ 40 వేల మార్కు చుట్టూనే కేసులు నమోదవుతున్నాయి. దాంతో, కొత్త అనుమానాలు కలుగుతున్నాయి అందరికీ. ఇంత స్థిరంగా గ్రాఫ్ కనిపిస్తోందంటే, ఇది రాబోయే ప్రమాదానికి పెను సంకేతమేనన్నది నిపుణుల అభిప్రాయం. జన జీవనం సాధారణ స్థితికి రావడం వల్లే కేసుల నమోదులో స్థిరత్వం వుందన్నది ఓ వాదన. అదే నిజమైతే, కేసుల సంఖ్య పెరగాలి కదా.? అన్నది మరికొందరి అనుమానం.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 2,500కి అటూ ఇటూగా వుంటోంది. తెలంగాణలో ఈ సంఖ్య దాదాపుగా 700 కావడం గమనార్హం. తెలంగాణలో లక్షకు పైగా టెస్టులు జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం రోజువారీ టెస్టుల సంఖ్య 80 నుంచి 90 వేలు.. చాలా అరుదుగా లక్ష టెస్టుల సంఖ్య నమోదవుతోంది. ఏపీలో ఇంకా కరోనా ఆంక్షలు కొనసాగుతుండగా, తెలంగాణలో ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేశారు. మొదటి వేవ్ తర్వాతి పరిస్థితుల్ని చూసుకుంటే, లాక్ డౌన్ ఎత్తివేసినా కేసులు తగ్గాయి. నిజానికి, కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ నుంచి వెసులుబాట్లు కల్పించడం మొదలు పెట్టాయి ప్రభుత్వాలు. సెకెండ్ వేవ్ తర్వాత ఏం జరగబోతోంది.? అంటే, అసలు మొదటి వేవ్ తర్వాత నమోదైన అత్యల్ప కేసుల సంఖ్యని సెకెండ్ వేవ్ ఇంకా అందుకోలేదు. అంటే, రెండో వేవ్ ముగిసినట్టు కాదు. ఈలోగానే మూడో వేవ్ వచ్చేస్తే.? అందుకు తగ్గట్టుగా సన్నాహాలైతే ప్రభుత్వాలు చేస్తున్నాయట. నమ్మగలమా.? దేవుడి మీదనే భారమంతా.