ఒరిస్సా, కర్నాటక, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, తమిళనాడు.. ఇలా పొరుగు రాష్ట్రాలన్నిటిలోనూ కరోనా వైరస్ కాస్త అదుపులోనే వున్నట్లు కనిపిస్తోంది. ఈ రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోనూ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ రోజువారీ టెస్టుల సంఖ్య లక్షకు పైగానే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కరోనా టెస్టుల లక్షకు చేరడం గగనంగా మారిపోతోంది ప్రతి రోజూ. రెండ్రోజులుగా టెస్టుల సంఖ్య మరీ తగ్గించేయడంతో, 2 వేల లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, ఎప్పుడైతే కరోనా టెస్టుల సంఖ్య 85 వేలకు చేరిందో.. కేసుల సంఖ్య కూడా 2,400 దాటింది.
ఇది ఒకింత భయంకరమైన పరిస్థితేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా అదుపులోనే వుందని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని అంటోంది. కరోనా మూడో వేవ్ వచ్చినా, ఇబ్బంది లేకుండా అందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. తెలంగాణలో రోజువారీ కేసుల సంఖ్య 600 మాత్రమే. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు 2 వేలు, ఆ పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్ని తెరవనుంది. దాంతో, తల్లిదండ్రులు ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ప్రాణాల్ని బలిపెట్టి, స్కూళ్ళకు పంపడం తమ వల్ల కాదని తల్లిదండ్రులంటున్నారు. అయితే, అప్పటికి పరిస్థితి అదుపులోకి వస్తుందనే విశ్వాసం ప్రభుత్వ వర్గాల్లో వుంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే సరిపోదు, ప్రజలూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మరి.