కరోనా సోకకుండా ఉండేలా అలాగే కొత్తరకం కరోనా వైరస్ పై కూడా తాము అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనిచేస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్ లోని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ లోని 2 విభాగాలు ఈ కొత్తరకం వైరస్ రకాన్ని సమర్థంగా అడ్డుకుంటాయని సంస్థ తెలిపింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల కీలక ప్రకటన చేశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కోవాగ్జిన్ టీకా తాజాగా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్టు కృష్ణ ఎల్ల వివరించారు. మరో 2 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటాయని, దీన్ని అత్యవసరంగా ఉపయోగించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు ముక్కు ద్వారా కోవాగ్జిన్ టీకా ఇస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని సంస్థ ప్రకటించటం సామాన్యులకు ఊరట అని చెప్పాలి.
బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు సోకుతున్న ఈ సరికొత్త స్ట్రెయిన్ అత్యంత స్ట్రాంగ్ వైరస్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పాలిట ఇది మరింత భయంకరంగా ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇక ఆల్రెడీ పలు దేశాల్లోని మార్కెట్లలోకి వచ్చిన కరోనా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా ఈ కొత్తరకం వైరస్ పై టీకాలు ఎలా పనిచేస్తాయన్న అనుమానాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.