మోడీజీ.. అవినీతి రహిత భారతావని సాధ్యమేనా.?

స్వతంత్ర భారతావని 75వ పుట్టినరోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఎర్రకోట సాక్షిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రజల్ని ఉద్దేశించి రాజకీయ ప్రసంగం చేశారు. ‘కుటుంబ పాలన’ని ఏరి పారెయ్యాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి.

అసలు కుటుంబ పాలన అంటే ఏంటి.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా ఆయన విమర్శలు చేశారు. అంతే కాదు, బీజేపీయేతర రాజకీయ పార్టీలు పరిపాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో పదే పదే బీజేపీ ‘కుటుంబ పాలన’ అనే విమర్శలు చేస్తున్న విషయం విదితమే.

దేశ ప్రధానిగా, ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబు.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. మరోపక్క, అవినీతిని దేశం నుంచి తరిమివేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు దేశ ప్రజల నుంచి.

ఏడున్నర దశాబ్దాలుగా ప్రతిరోజూ అవినీతి రహిత పాలన.. అనే మాటని దేశ ప్రజలు వింటూనే వున్నారు. దురదృష్టం ఏంటంటే, పాత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం మరింత అవినీతి మయం.. అనేలానే వుంటోంది పరిస్థితి. జస్ట్, అవినీతి రూపం మార్చుకుంటోంది తప్ప.. అవినీతి లేకుండా రాజకీయం, పరిపాలన అనేవి సాధ్యం కావడంలేదు.

కొంతమంది వ్యక్తులు మాత్రమే కోవిడ్ సంక్షోభ సమయంలోనూ అపర కుబేరులయ్యారంటే, అపర కుబేరులు మాత్రమే మరింత ఆర్జనతో సరికొత్త రికార్డులు సృష్టించారంటే.. దానర్థమేంటి.? అది రాజకీయ అవినీతి కాదా.? రాజకీయ ప్రమేయం లేకుండా కొందరు వ్యక్తులు మాత్రమే ఎలా అత్యంత సంపన్నులవుతారు.? మోడీ అధికార పీఠమెక్కాక, ఎంతమంది అక్రమార్కుల్ని జైలుకు పంపారు.? ఎంత అవినీతి సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేశారు.?