Corona Vaccine: మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అయితే, వ్యాక్సిన్ తయారీ సంస్థలు, తమ వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికీ, అలాగే రాష్ట్రాలకూ, ప్రైవేటు ఆసుపత్రులకూ విడివిడిగా వివిద రేట్లకు విక్రయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దాంతో, ఆయా సంస్థలు తమ రేట్లను ప్రకటించేస్తున్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కేంద్రానికి 150 రూపాయలకీ, రాష్ట్రాలకు 400 రూపాయలకీ, ప్రైవేటు ఆసుపత్రులకైతే 600 రూపాయలకు విక్రయించనున్నట్లు వెల్లడించింది సీరం సంస్థ. ఇదెక్కడి న్యాయం.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.
ఇంతలోనే, భారత్ బయోటెక్ సంస్థ తమ కోవాగ్జిన్ ధరను ప్రకటించింది. కేంద్రానికి 150 రూపాయలకే ఈ వ్యాక్సిన్ అందుతుంది. రాష్ట్రాలు మాత్రం 600 రూపాయలు వెచ్చించాలి. అదే, ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రం 1200 రూపాయలకు విక్రయిస్తారు. అంటే, రెండు డోసుల కోవాగ్జిన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో 2400 రూపాయలు ధర పలుకుతుందన్నమాట. ఇదెక్కడి రాజకీయం.?
నిజమే, ఇది వ్యాపారం కాదు, రాజకీయమే. 150 రూపాయల వ్యాక్సిన్ 1200 రూపాయలకు ధర పెంచుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయా సంస్థలకుకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చి, దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్, అత్యంత వేగవంతంగా చేయాలి కదా.? తయారయ్యే వ్యాక్సిన్లన్నటినీ కేంద్రమే విక్రయిస్తే అసలు సమస్యే వుండదు. రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి రావడమేంటో.? ఇదంతా చూస్తోంటే, వ్యాక్సిన్ల వెనుక పెద్ద రాజకీయ కుంభకోణం ఏదైనా వుందా.? అన్న అనుమానాలు కలగకమానవు.
ఇండియాలో అంతే.. అన్నటికీ రాజకీయమే. రోజుకి 2500 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్న వేళ.. కొత్తగా రోజుకి మూడున్నర లక్షల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న సమయంలో, వ్యాక్సిన్ల ధరలు ఇలా తెరపైకి రావడాన్ని రాజకీయం కాక మరేమనుకోవాలి.?