ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరైన నేపథ్యంలోనే వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైరస్ నుంచి కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించారు. ఇక ఆదివారం వైకాపా తెనాలి నియోజక వర్గం ఎమ్మెల్యే బత్తుని శివ కుమార్ కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయమే ఆయనకు కరోనా సోకిందన్న వార్త అధికారికంగా మీడియాకి ఎక్కింది. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు.
ఈ నేపథ్యంలో తాజాగా తుని-పాయకరావు పేట వైకాపా ఎమ్మెల్యేలు దాడి శెటి రాజా, గొల్ల బాబురావులకు కూడా కరోనా బారిన పడ్డట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన తర్వాత ఆ నియోజకవర్గం ఇద్దరు ఎమ్మెల్యేలు ఇళ్లు దాటి బయటకు రావడం లేదు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం జంట నగరాలుగా పేరొందిన తుని-పాయకరావు పేట లో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయడానికి ప్రధాన కారణం కూడా అదేనని విశ్వసనీయ సమాచారం.
ఈ ఆదివారం ఏకంగా 24 గంటలు ఆ రెండు ప్రాంతాల్లో కర్ఫ్‌యూ విధించడంతో కథనాలకు బలం దొరికింది. ఆ ఇద్దరి ఎమ్మెల్యేల ఇళ్లు పోలీసులు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తుని-పాయకరావు పేటలో ఉదయం ఆరు గంటల నుంచి 11 వరకూ మాత్రమే అనుతిస్తున్నారు. క్లోజింగ్ కు గంట ముందే పోలీసులు షాపులన్నింటిని మూసి వేస్తున్నారు.