వైకాపాలో కరోనా కలకలం మొదలైందా? ఇప్పుడా పార్టీ ఎమ్మెల్యేలు అంతా టెన్షన్ లో ఉన్నారా? అసెంబ్లీ వేదికగా కరోనా అంటుకుందా? అంటే అవుననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు అనంతరం విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశాఖలో తన గెస్ట్ హౌస్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. అటుపై మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో కరోనా కలకలం మొదలైంది.
బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు ఎలా అంటుకుందో ఇంకా తెలియలేదు. దీంతో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ అంతా పరీక్షలు చేయించుకుంది. ఇంకా ఆయనతో కాంటాక్ట్ లో ఉన్న వారందర్నీ వెతికి పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు అంబటి రాంబాబు కుటుంబంలో వైరస్ సోకినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంతో తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ లోనే ఉండాలని తన గన్ మెన్ కు కూడా ఆయన సూచించారు. సుధాకర్ వృత్తిరీత్యా డాక్టర్.
ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అటుపై పనుల నిమిత్తం కొన్ని ఏరియాల్లో కూడా తిరిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన తిరిగిన ఏరియాలన్నింటిని జల్లెడ పడుతున్నారు. ఇలా వరుసగా వైకాపా ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో మిగతా ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేల గుండెల్లో ఇప్పుడు కరోనా రైళ్లు పరిగెడుతున్నాయి. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ పార్టీ నేతల్లోనూ టెన్షన్ మొదలైంది. మొత్తానికి ఏపీలో పొలిటికల్ కారిడార్ లోనూ కరోనా టెన్షన్ షురూ అయింది.