ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అంతా సిద్ధమవుతోంది. ఏప్రిల్ 9 నుంచి పోటీలు జరుగుతాయి. వివిధ జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఇంతలోనే పెద్ద షాక్.. ఆటగాళ్ళకు కరోనా సోకినట్లు తేలుతోంది.. సిబ్బంది కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీ సందర్భంగా రాణించిన అక్షర్ పటేల్ కరోనా బారిన పడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి అతనొక కీలక ఆటగాడు. ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లకు సంబంధించి కొంతమంది సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో, మహారాష్ట్రలో అసలు ఐపీఎల్ ఆడేందుకు అవకాశాలే కన్పించడంలేదు. మహారాష్ట్ర స్థానంలో తెలంగాణకు ఆ అవకాశం దక్కేలా వుంది.
ఏ హైద్రాబాద్‌ని అయితే బీసీసీఐ, ఐపీఎల్ పోటీల నిమిత్తం వద్దనుకుందో.. అదే హైద్రాబాద్ ఇప్పుడు అవసరమైంది. ఒకరిద్దరు ఆటగాళ్ళు మినహా ఇంకెవరికీ కరోనా సోకే అవకాశం లేదని బీసీసీఐ చెబుతుండడం కాస్త ఊరటనిచ్చే అంశమే. కానీ, బీసీసీఐ లేదా ఐపీఎల్ నిర్వాహకులు చెప్పే మాటల్ని పూర్తిగా విశ్వసించలేం. ఎందుకంటే, కరోనా అత్యంత వేగంగా భారతదేశంలో విస్తరిస్తోంది. మహారాష్ట్రలో రోజుకి 40 వేల కేసుల పైనే నమోదవుతున్నాయి. ఆ సంఖ్య నేడో రేపో 50 వేలు దాటిపోవచ్చు. ఇక, తమిళనాడులోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాంటప్పుడు ఐపీఎల్ పోటీల నిర్వహణ ఎంతవరకు సబబు.? అన్న చర్చ క్రికెట్ అభిమానుల్లోనూ జరుగుతోంది. ఆటగాళ్ళు కరోనా బారిన పడి, జరగరానిదేదైనా జరిగితేనో.? ఆటగాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి ఐపీఎల్ నిర్వహించడం అనేది అస్సలేమాత్రం సబబు కాదనే చర్చ క్రికెట్ అభిమానుల్లో జరుగుతోంది.